తేనెసోనలు(అ-న) : తడ వాడిరి (10.1-290-క.)
10.1-290-క.
- ఉపకరణాలు:
తడవాడిరి బలకృష్ణులు
దడవాడిరి వారిఁ జూచి తగ రంభాదుల్
దడవాడి రరులు భయమునఁ
దడవాడిరి మంతనములఁ దపసులు వేడ్కన్.
టీకా:
తడవు = చిరకాలం; ఆడిరి = క్రీడించిరి; బల = బలరాముడు; కృష్ణులున్ = కృష్ణుడు; తడవు = కొంతసేపు; ఆడిరి = నాట్యము లాడిరి; వారిన్ = వారిని; చూచి = చూసి; తగన్ = తగినట్లుగ; రంభ = రంభ; ఆదుల్ = మున్నగువారు; తడవాడిరి = తడబడిరి; అరులు = శత్రువులు; భయమునన్ = భీతిచేత; తడవు = చాలాసేపు; ఆడిరి = మాట్లాడుకొనిరి; మంతనములన్ = రహస్యముగా; తపసులు = ఋషులు; వేడ్కన్ = కుతూహలముతో.
భావము:
బాల్యక్రీడలలో బలరామ కృష్ణులు ఆలా ఎంతోసేపు ఆడుతుంటే చూసి, రంభ మొదలైన అప్సరసలు ఆకాశంలో ఆనందంగా ఆడుతున్నారు. అరిషడ్వర్గం అనే శత్రువులు పెచ్చుమీరినవారు దుర్మార్గులు. వారు భయంతో తడబడ్డారు. ఋషులు లోకానికి మంచి దనే సంతోషంతో రహస్యంగా ముచ్చట్లలో ఓలలాడారు. అలతి పొలతి పదాలలో అనంత పరమార్థాలు అందిస్తూ అందరినీ అలరించటంలో ఆరితేరిన బమ్మెరవారి పద్యమాణిక్యం యిది. కృష్ణునికి చెందిన అఖిలం మథురం. ఆ మాయామాణవబాలకుని, కృష్ణలీలలు శైశవ లీలలు బహు పదునైన మథురాతి మథురాలు. అందుకే రంభ మున్నగు అప్సరసలు ఆ రసాప్రవాహంలో మునిగితేలుతూ నాట్యాలు చేస్తున్నారట. మునీశ్వరులు ఆనందంతో రహస్యంగా ముచ్చట లాడుతున్నారట. అలా అందరూ వారి వ్యక్తిత్వాన్ని బట్టి సంతోష ప్రకటన చూపుతున్నారు. మరి మంచికి మంచి, చెడుకు చెడు అన్నట్లు అవే కృత్యాలు దుర్మార్గులకు ఆయన శత్రువు కనుక వారు భయంతో తడబడుతున్నారు.