పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఒనరన్ (1-21-మ.)

1-21-మ.

రన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
నంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.

టీకా:

ఒనరన్ = (రచనలు) చేసేటప్పుడు; నన్నయ = నన్నయ; తిక్కన = తిక్కన; ఆది = మొదలైన; కవులు = కవులు; ఈ = ఈ; ఉర్విన్ = భూమ్మీద; పురాణ = పురాణ {పురాణలక్షణములు - సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము}; ఆవళుల్ = సమూహములు; తెనుఁగు = ఆంధ్రీకరణ; చేయుచున్ = చేస్తూ; మత్ = నాయొక్క; పురా = పూర్వ జన్మలలో; కృత = చేసిన; శుభ = పుణ్యపు; అధిక్యంబు = గొప్పతనం; తాన్ = అది; ఎట్టిదో = ఎలాంటిదో కాని; తెనుఁగు = ఆంధ్రీకరణ; చేయరు = చేయలేదు; మున్ను = ఇంతకు ముందుగ; భాగవతమున్ = భాగవతాన్ని; దీనిన్ = దీనిని; తెనింగించి = ఆంధ్రీకరించి; నా = నాయొక్క; జననంబున్ = జన్మని; సఫలంబు = సార్థకము; చేసెదన్ = చేసుకుంటాను; పునః = పునః; జన్మంబున్ = జన్మమును; లేకుండఁగన్ = లేకుండే లాగ.

భావము:

సంస్కృతంలో ఉన్న పురాణగ్రంథాలు అనేకం ఇప్పటికే నన్నయ భట్టారకుడూ, తిక్కన సోమయాజి మొదలైన కవీశ్వరులు తెలుగులోకి తీసుకొచ్చారు. నేను పూర్వజన్మలలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఆ మహామహులు భారత రామాయణాలు తప్ప భాగవతం జోలికి రాలేదు. బహుశః నా కోసమే భాగవతాన్ని వదిలిపెట్టి ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మహాగ్రంథాన్ని తెలుగులోకి వ్రాసి మళ్లీ జన్మంటూ లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను.
శ్రీమత్ మహాభాగవత ఆంధ్రీకరణ చేపట్టే సందర్భంలో బమ్మెర వంశోద్ధారకులవారు తీసుకున్న నిర్ణయాలలో ఒకటిది. ఆ మహానుభావుని భక్తిప్రపత్తి, వినయసంపద "మత్పురాకృత శుభాధిక్యం" అనటంలో ప్రస్ఫుటమౌతున్నాయి; "దీనిందెనిగించి . . . పునర్జన్మంబు లేకుండగన్" అనటంలో ఆత్మవిశ్వాసం ప్రతిఫలిస్తోంది. కవిత్య పటుత్వంతో కూడి పద్య సౌందర్యం ఇనుమడించింది.