పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఒక్కడు ము న్నేమఱి (10.1-457-క.)

10.1-457-క.

క్కఁడు ము న్నేమఱి చన
నొక్కఁడు బలుబొబ్బ వెట్టు నులికిపడన్; వే
ఱొక్కఁడు మిట్టి తటాలున
నొక్కని కనుదోయి మూయు నొక్కఁడు నగఁగన్.

టీకా:

ఒక్కడు = ఒకానొకడు; మున్ను = ముందుకి; ఏమఱి = పరాకుపడి; చనన్ = పోగా; ఒక్కడున్ = ఒకానొకడు; పలు = పెద్ద; బొబ్బన్ = కేకలు; పెట్టున్ = వేయును; ఉలికిపడన్ = ఉలికిపడునట్లుగా; వేఱొక్కడు = మరింకొకడు; మిట్టి = అతిశయించి; తటాలున = చటుక్కున; ఒక్కని = ఒకానొకని; కను = కళ్ళు; దోయి = రెంటిని (2); మూయున్ = చేతులతో కప్పివేయును; ఒక్కడున్ = ఒకానొకడు; నగగన్ = నవ్వుతుండగా.

భావము:

పరధ్యానంగా ఒక గోపకుమారుడు ముందు నడుస్తుంటే గమనించినవాడు, అత నులిక్కిపడేలా పెనుబొబ్బ పెట్టాడు. ఒక గోపడు మరొకని కళ్ళు వెనకనించి తటాలున మూసాడు. అది చూసి ఇంకొకడు పకపక నవ్వుతున్నాడు.
భాగవతంలో బహు రసవంతమైన ఘట్టం గోపాలబాలురు శ్రీకృష్ణ భగవానునితో చల్దులు గుడుచుట. ఈ సందర్భంలోని ఈ అమృత గుళికలో పోతనామాత్యులు, వారి బాల్యచేష్టలను పరమాద్భుతమైన వర్ణనలతో దృశ్యమానం చేశారు.