పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఓ కదళీస్తంభోరువ (3-731-క.)

3-731-క.

దళీస్తంభోరువ!
యే కుల? మే జాడదాన? వెవ్వరి సుత? వి
ట్లేకాంతంబున నిచ్చట
నే కారణమునఁ జరించె? దెఱిఁగింపు తగన్.

టీకా:

ఓ = ఓ; కదళీ = అరటి; స్తంభ = స్తంభముల వంటి; ఊరువ = తొడలు కలదానా; ఏ = ఏ; కులము = వర్ణమునకు; ఏ = ఏ; జాడ = ప్రాంతమునకు; దానవున్ = చెందినదానవు; ఎవ్వారి = ఎవరి యొక్క; సుతవు = పుత్రికవు; ఇట్లు = ఈ విధముగ; ఏకాంతమున = ఒంటరిగ; ఇచటన్ = ఇక్కడ; ఏ = ఏ; కారణమునన్ = కారణముచేత; చరించెదవు = తిరుతుంటివి; ఎఱిగింపు = తెలుపుము; తగన్ = అవశ్యము.

భావము:

అరటి బోదెల లాంటి నున్నటి తొడలు గల సుందరీ! నీదే కులం? నీదే ఊరు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు నీవు ఇక్కడ వంటరిగా తిరుగుతున్నావు? మాకు తెలిసేలా చెప్పు.
సృష్టి ఆదిలో తను సృష్టించిన రాక్షసులబారి నుండి తప్పించుకోడానికి బ్రహ్మదేవుడు తన దేహాన్ని విడిచాడు. ఆ దేహంనుండి ఆ రాక్షసులను మోహంలో పడేసిన సంధ్యాసుందరి జనించింది. ఆ సంధ్యాసుందరిని వరిస్తున్న ఆ రాక్షసుల నోట పలికించిన రసగుళి కిది. చిట్టిపొట్టి పదాలతో ఎంతటి గంభీర భక్తిభావాలైనా, సరస శృంగారమైనా పండించగల మేటి పోతన గారికి వారే సాటి.