పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : నీరాట వనాటములకు (8-19-క.)

8-19-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీరాట వనాటములకుఁ
బోరాటం బెట్లు కలిగెఁ? బురుషోత్తముచే
నారాట మెట్లు మానెను
ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్.

టీకా:

నీరాట = మొసలి {నీరాటము - నీటిలోచరించునది, మొసలి}; వనాటముల = ఏనుగుల {వనాటము -అడవిలోచరించునది, ఏనుగు}; కున్ = కు; పోరాటంబు = కలహము; ఎట్లు = ఏ విధముగ; కలిగెన్ = కలిగినది; పురుషోత్తముని = విష్ణుమూర్తి; చేన్ = చేత; ఆరాటమున్ = సంకటమును; ఎట్లు = ఏ విధముగ; మానెను = తీరినది; ఘోర = భయంకరమైన; అటవి = అడవి; లోని = అందలి; భద్రకుంజరమున్ = గజరాజున {గజభేదములు - 1భద్రము 2మందము 3మృగము}; కున్ = కు.

భావము:

నీటిలో బతుకుతుంది మొసలి. అడవిలో తిరుగుతుంది ఏనుగు. వాటిలో అది భద్రగజం. అయితే ఆ రెంటికి అసలు పోరాటం ఎందుకు జరిగింది ఎలా జరిగింది. అలా జరిగిన ఆ పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి ఆ గజేంద్రుడి ఆరాటాన్ని ఎలా పోగొట్టి కాపాడాడు.
భాగవతం బహుళార్థ సాధక గ్రంధం. అందులో పంచరత్న ఘట్టాలలో ఒకటైన గజేంద్రమోక్షంలోనే ఎత్తుగడ పద్యం ఇది. చక్కటి ఏకేశ్వరోపాసనతో కూడుకున్న ఘట్టమిది. మంచి ప్రశ్న వేస్తే మంచి సమాధానం వస్తుంది. ఇంత మంచి ప్రశ్న పరీక్షిత్తు వేసాడు కనుకనే శుకని నుండి గజేంద్రమోక్షం అనే సుధ జాలువారింది. ఇక్కడ పోతనగారి చమత్కారం ఎంతగానో ప్రకాశించింది. ఇందులో త్రిప్రాసం ఉంది “నీరాట, పోరాట, నారాట, ఘోరాట” అని. భాషకి అలంకారాలు అధ్భుతమైన సౌందర్యాన్ని చేకూరుస్తాయి. రెండు లేక అంత కంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు మరల మరల వస్తూ అర్థ భేదం కలిగి ఉంటే అది యమకాలంకారం. ఛేకాను ప్రాసంలో పదాల మధ్య ఎడం ఉండాలి. యమకంలో ఎడం ఉడటం లేకపోడం అనే భేదం లేదు. ఇక్కడ పోతనగారు ప్రయోగించిన యమకం అనే అలంకారం అమిత అందాన్ని ఇచ్చింది. యమకానికి చక్కటి ఉదాహరణ ఇదే అని చెప్పవచ్చు. ఏనుగులు భద్రం, మందం, మృగం అని మూడు రకాలు. వాటిలో భద్రగజం దైవకార్యాదులలో వాడతారు. అట్టి భద్రగజాల కోటికి రాజుట మన కథానాయకుడు గజేంద్రుడు. అఖిలలోకేశ్వరుడు, దయాసాగరుడు ఐన శ్రీహరి మొసలి నోటికి చిక్కిన ఒక గజరాజుని ప్రాణభయంనుండి కాపాడి రక్షించాడు. ఈ అధ్భుత ఘట్టంలోని “ఎవ్వనిచే జనించు. . .” మున్నగు పద్యాలన్నీ అమృతగుళికలే కదా.