పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : నీ పద్యావళు లాలకించు (10.1-408-శా.)

10.1-408-శా.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్
నీపేరం బనిచేయు హస్తయుగముల్ నీమూర్తిపైఁ జూపులున్
నీపాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీసేవపైఁ జిత్తముల్
నీపైబుద్దులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణా!

టీకా:

నీ = నీ యొక్క; పద్య = పద్యముల; ఆవళుల్ = సమూహములను; ఆలకించు = వినెడి; చెవులున్ = చెవులూ; నిన్నున్ = నిన్ను; ఆడు = స్తుతించెడి; వాక్యంబులున్ = మాటలూ; నీ = నీకు; పేరన్ = సమర్పణగా; పనిచేయు = పనిచేసెడి; హస్త = చేతుల; యుగముల్ = జంటలూ; నీ = నీ యొక్క; మూర్తి = స్వరూపము; పైన్ = మీది; చూపులున్ = దృష్టులూ; నీ = నీ యొక్క; పాదంబులన్ = పాదముల; పొంతన్ = దగ్గర; మ్రొక్కు = వాలినమస్కరించెడి; శిరముల్ = తలలూ; నీ = నీ; సేవ = సేవచేయుట; పైన్ = అందే; చిత్తముల్ = మనసులూ; నీ = నీ; పైన్ = మీది; బుద్ధులు = బుద్ధులూ; మా = మా; కున్ = కు; ఇమ్ము = ఇమ్ము; కరుణన్ = దయతో; నీరేజపత్రేక్షణా = శ్రీకృష్ణా {నీరేజపత్రేక్షణుడు - తామర రేకుల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}.

భావము:

ఓ కమలపత్రాల వంటి కన్నులున్న కన్నయ్యా! నీ స్తుతి చేసే పద్యాలను విడువక వింటూ ఉండే చెవులను, నిన్ను విడువక స్తోత్రం చేస్తు ఉండే వాక్కులను మాకు అనుగ్రహించు. ఏ పని చేస్తున్నా నీ పేరనే నీ పనిగానే చేసే చేతలను, ఎప్పుడు విడువక నిన్నే చూసే చూపులను మాకు అనుగ్రహించు. నీ పాదపద్మాలను విడువక నమస్కరించే శిరస్సులను, నీమీద ఏకాగ్రమైన భక్తి కలిగి ఉండే మనస్సును, నిరంతరం నీ ధ్యానం పైనే నిలిచి ఉండే బుద్ధిని మాకు దయతో ప్రసాదించు, పరమేశ్వరా!
బాలకృష్ణుడు తన నడుముకు కట్టిన రోలు ఈడ్చుకుంటూ రెండు మద్దిచెట్లను కూల్చాడు. వాటినుండి విముక్తులైన గుహ్యకులు కపటబాలుని స్తుతించి మాకు నీ యందు ప్రపత్తిని అనుగ్రహించమని ఇలా వేడుకున్నారు. ఇది భాగవతుల ధర్మాలని నిర్వచించే ఒక పరమాద్భుతమైన పద్యం. అందుకే ఒక శార్దూలాన్ని వదలి, ప్రాసాక్షార నియమాన్ని యతి స్థానాలైన మొదటి, పదమూడవ స్థానాలకు కూడా ప్రసరింపజేసి పంచదార పలుకలకు ప్రత్యేక జిలుగులు అద్దారు పోతనామాత్యులు.