పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : కటి విరాజిత (3-538-సీ.)

3-538-సీ.

టి విరాజిత పీతకౌశేయశాటితో;
వితత కాంచీగుణ ద్యుతి నటింప
నాలంబి కంఠ హారావళి ప్రభలతోఁ;
గౌస్తుభరోచులుగ్రందుకొనఁగ
నిజకాంతి జిత తటిద్వ్రజ కర్ణ కుండల;
రుచులు గండద్యుతుల్ ప్రోదిసేయ
హనీయ నవరత్నయ కిరీటప్రభా;
నిచయంబు దిక్కుల నిండఁ బర్వ

3-538.1-తే.

వైనతేయాంస విన్యస్త వామహస్త
లిత కేయూర వలయ కంకణము లొప్ప
న్యకరతల భ్రమణీకృతానుమోద
సుందరాకార లీలారవింద మమర.

టీకా:

కటి = మొలప్రాంతమున; విరాజిత = విరాజిల్లుతున్న; పీత = పచ్చని; కౌశేయ = పట్టు; శాటి = వస్త్రము; తోన్ = తో; వితత = మించుతున్న; కాంచీగుణ = మొలతాడు; ద్యుతి = ప్రకాశము; నటింపన్ = విరజిమ్ముతుండగా; ఆలంబి = వేలాడే; కంఠ = మెడలోని; హార = హారముల; ఆవళి = వరుసలు యొక్క; ప్రభలన్ = ప్రకాశము; తోన్ = తో; కౌస్తుభ = కౌస్తుభమణి; రోచులు = కాంతులు; క్రందుకొనగన్ = కమ్ముకొనగా; నిజ = తన; కాంతి = ప్రకాశముచే; జిత = జయింపబడిన; తటిత్ = మెరుపుతీగల; వ్రజ = సమూహములు కల; కర్ణ = చెవి; కుండల = కుండలముల; రుచులు = కాంతి; గండ = చెక్కిళ్ల; ద్యుతుల్ = కాంతులు; ప్రోదిసేయన్ = కలిసిపోగా; మహనీయ = గొప్ప; నవరత్న = నవరత్నములు {నవరత్నములు - తొమ్మిది జాతుల మణులు, 1 మౌక్తికము (ముత్యము) 2 పద్మరాగము (కెంపు) 3 వజ్రము 4 ప్రవాళము (పగడము) 5 మరకతము (గరుడ పచ్చ, పచ్చ) 6 నీలము 7 గోమేధికము 8 పుష్యరాగము 9 వైడూర్యము}; మయ = పొదిగిన; కిరీట = కిరీటము యొక్క; ప్రభా = కాంతుల; నిచయంబున్ = సమూహములు; దిక్కులన్ = నలుదిక్కులను {నలుదిక్కులు - తూర్ప దక్షిణము పడమర ఉత్తరములు}; నిండ = నిండుగా; పర్వన్ = వ్యాపించగా;
వైనతేయ = గరుత్మంతుని {వైనతేయుడు - వినతా దేవి యొక్క పుత్రుడు, గరుత్మంతుడు}; అంస = మూపుపై; విన్యస్త = ఉంచబడిన; వామ = ఎడమ; హస్త = చేతికి; కలిత = ఉన్నట్టి; కేయూర = భుజకీర్తులు; వలయ = మురుగులు; కంకణముల్ = కంకణములు; ఒప్పన్ = ఒప్పియుండగా; అన్య = ఇంకొక; కరతల = అరచేతిలో; భ్రమణీ = తిప్పుతూ; కృతా = ఉన్నట్టి; అనుమోద = సంతోషముతో కూడిన; సుందర = అందమైన; ఆకార = ఆకారముతో; లీలన్ = లీలకైన; అరవిందము = పద్మము; అమరన్ = అమరి ఉండగా.

భావము:

అయిదేళ్ళ బాలకులవలె నున్న కుమార చతుష్కం అయిన సనకసనందాదులు శ్రీమహావిష్ణువు దర్శనార్థం వైకుంఠం వెళ్ళారు. ద్వారపాలకులైన జయవిజయులు అడ్డగించగా వారిని శపించారు. ఇంతలో దర్శన మిచ్చిన శ్రీమహావిష్ణువు వర్ణన:
  ఆ శ్రీహరి నడుము చుట్టూ ప్రకాశించే పచ్చని పట్టుపంచెతో బంగారు మొలత్రాడు వెలుగులు వెదజల్లుతున్నది. కంఠం చుట్టూ ఉన్న రత్నహారాల కాంతులు కౌస్తుభమణి కాంతులతో కమ్ముకొంటున్నాయి. మెరుపుతీగలను మించి ప్రకాశించే కర్ణకుండలాల కాంతులు చెక్కిళ్ళ కాంతులతో కలిసిపోతున్నాయి. గొప్పనైన నవరత్నాలు పొదిగిన కిరీటం కాంతులు నలుదిక్కులలో వ్యాపిస్తున్నాయి. గరుత్మంతుని మూపుపై ఆనించిన ఎడమచేతికి భుజకీర్తులు, మురుగులు, కంకణాలు ముచ్చట గొలుపుతుండగా, కుడి అరచేతిలో తిప్పుతున్న అందమైన పద్మం అమరి ఉండగా శ్రీహరి వచ్చాడు.