పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : కర్ణాలంబిత (10.1-502-శా)

10.1-502-శా
.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్ణాలంబిత కాక పక్షములతో గ్రైవేయహారాళితో
స్వర్ణాభాసిత వేత్రదండకముతో త్పింఛదామంబుతోఁ
బూర్ణోత్సాహముతో ధృతాన్నకబళోత్ఫుల్లాబ్జహస్తంబుతోఁ
దూర్ణత్వంబున నేఁగె లేఁగలకునై దూరాటవీవీధికిన్.

టీకా:

కర్ణా = చెవులమీద; ఆలంబిత = వేళ్ళాడుచున్న; కాకపక్షముల = జులపాల; తోన్ = తోటి; గ్రైవేయ = మెడలోవేసుకొన్న; హార = దండల; ఆళి = వరుసల; తోన్ = తోటి; స్వర్ణ = బంగారము; ఆభాసిత = తొడిగిన, తాపడముచేసిన; వేత్రదండకము = బెత్తంకర్ర; తోన్ = తోటి; సత్ = మంచి; పింఛ = నెమలిపింఛముల; దామంబు = మాల; తోన్ = తోటి; పూర్ణ = నిండు; ఉత్సాహము = పూనిక; తోన్ = తోటి; ధృత = ధరింపబడిన; అన్న = అన్నపు; కబళ = ముద్దకలిగిన; ఉత్ఫుల్ల = విరిసిన; అబ్జ = పద్మమువంటి; హస్తంబు = చేతి; తోన్ = తోటి; తూర్ణత్వంబునన్ = తొందరకలిగి; ఏగెన్ = వెళ్ళెను; లేగలు = దూడలు; కున్ = కోసము; ఐ = అయ్యి; దూర = దూరమునందలి; అటవీ = అడవి; వీధికిన్ = మార్గమున.

భావము:

కృష్ణుడు దూడలకై అడవిలో వెదక బోవుట – జులపాల జుట్టు చెవులదాకా వేళ్ళాడుతూ ఉంది. మెడలో హారాలు మెరుస్తున్నాయి. బంగరంలా మెరిసే కర్ర చేతిలో ఉంది. చక్కటి నెమలి పింఛం తలపై ధరించాడు. ఎర్రటి అర చేతిలో తెల్లటి అన్నం ముద్ద మెరిసి పోతూ ఉంది. ఇలా గోపాల కృష్ణుడు ఉత్సాహంతో లేగదూడలను వెదకడానికి అడవిలో ఎంతో దూర ప్రాంతాలకి వెళ్ళాడు.