పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : కంటిగంటి (10.2-1152-మత్త.)

10.2-1152-మత్త.

కంటిగంటి భవాబ్ధి దాఁటఁగఁ గంటి ముక్తినిధానముం
గంటి నీ కరుణావలోకముఁ గంటి బాపము వీడ ము
క్కంటి తామరచూలియుం బొడఁ గాననట్టి మహాత్మ! నా
యింటికిం జనుదెంచి తీశ్వర! యేఁ గృతార్థతఁ బొందితిన్.

టీకా:

కంటిగంటి = చూడగలిగితిని; భవ = సంసారము అను; అబ్దిన్ = సముద్రమును; దాటగన్ = తరించుటను; కంటిన్ = ఎరిగితిని; ముక్తి = మోక్షమునకు; నిధానమున్ = నిధివంటిదానిని; కంటిన్ = కనుగొంటిని; నీ = నీ యొక్క; కరుణా = దయాపూరిత; అవలోకమున్ = చూపులను; కంటి = పొందితిని; పాపము = పాపములు; వీడన్ = తెలగిపోగా; ముక్కంటి = శివుడు; తామరచూలియున్ = బ్రహ్మదేవుడు; పొడగాననట్టి = చూడజాలనట్టి; మహాత్మా = గొప్పవాడ; నా = నా; ఇంటి = గృహమున; కిన్ = కు; చనుదెంచితి = వచ్చితివి; ఈశ్వర = భగవంతుడా; ఏన్ = నేను; కృతార్థుతన్ = ధన్యుతను; పొందితిన్ = పొందాను.

భావము:

శ్రీకృష్ణభగవానుడా! ఓ మహాత్మా! నీవు నా మందిరానికి విచ్చేశావు. పరమ శివుడు బ్రహ్మదేవుడు సైతం కానరాని నిన్ను నేను దర్శించ గలిగాను. నేను ధన్యుణ్ణి అయ్యాను. సంసార సాగరాన్ని దాట గలిగాను. మోక్షమార్గాన్ని అందుకో గలిగాను. నా పాపం అంతా అంతరించి పోయింది.
మృతులైన దేవకీ పుత్రులు తన సహోదరులు ఏడుగురుని తెచ్చి తల్లికి చూపటం కోసం, శ్రీకృష్ణుడు యమలోకానికి వెళ్ళాడు. అప్పుడు యముడు చేసిన కృష్ణుని స్తుతి.