పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : కంఠేకాలునిచేతం (9-615-క.)

9-615-క.

కంఠేకాలునిచేతం
గుంఠితుఁడగు టెట్లు మరుఁడు? కుసుమాస్త్రంబుల్
లుంఠించి గుణనినాదము
ఠంమ్మన బాల నేసె వఠవ గదురన్.

టీకా:

కంఠేకాలుని = పరమశివుని {కంఠేకాలుడు - కంఠము నల్లగానున్నవాడు, శంకరుడు}; చేతన్ = వలన; కుంఠితుడు = దహింపబడినవాడు; అగుట = ఐ ఉండుట; ఎట్లు = ఎలా అగును, కాదు; మరుడున్ = మన్మథుడు; కుసుమ = పూల; అస్త్రంబుల్ = బాణములను; లుంఠించి = సంధించి; గుణ = అల్లెతాడు; నినాదము = ధ్వని; ఠంఠమ్ము = ఠంకారము; అనన్ = చేయగా; బాలన్ = బాలికపైన; ఏసెన్ = ప్రయోగించెను; ఠవఠవ = టకటకమని; కదురన్ = పడేలాగ.

భావము:

అదిగో మన్మథుడు ఆ పిల్ల మీద అల్లెతాడు ఠంఠమ్మనేలా పూలబాణాలు సంధించి ఠవఠవ మని నాటేలా వేసాడు. కంఠం నల్లగా ఉన్న శంకరుడు మరులురేపే మన్మథుని దహించాడు అంటే ఎలా నమ్మేది.
దుష్యంతోపాఖ్యానంలో మధుర పద్య మిది. శకుంతల దుష్యంతుణ్ణి చూసింది. ఆ ప్రథమ వీక్షణంలోనే మన్మథుడి బాణాలకు లోనైంది. అంతవరకూ బానే ఉంది కాని ఇక్కడ కవి చమత్కారం చూడండి. వర్తమాన కాలంలో మన్మథుడు బాణాలు వేసాడు. అంటే మన్మథుడు ఉన్నట్లే. కాలి బూడిదైపోయిన వాడు బతికి వచ్చి బాణాలు వేయలేడు కదా. మరి పూర్వకాలంలోనే పరమశివుడి మూడోకంటి వీక్షణాగ్నికి బూడిదైపోయాడు అని ఎలా అనగలం. ఆపైన అసలే కంఠం నల్లగా ఉన్న వాడి గురించిన విషయం. ఇంకెలా నమ్మేది.