పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : కామోత్కంఠత

7-18-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా
సామాగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులున్,
బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రింగంటి; మెట్లైన ను
ద్ధా ధ్యానగరిష్ఠుఁ డైన హరిఁ జెందన్ వచ్చు ధాత్రీశ్వరా!

టీకా:

కామ = మన్మథ వికారము నందలి; ఉత్కంఠతన్ = ఆసక్తితో; గోపికల్ = గోపికలు; భయమునన్ = భయముతో; కంసుండు = కంసుడు; వైర = విరోధపు; క్రియన్ = చేతల; సామగ్రిన్ = బలమున; శిశుపాల = శిశుపాలుడు; ముఖ్య = మున్నగు; నృపతుల్ = రాజులు; సంబంధులు = చుట్టరికము గల వారు; ఐ = అయ్యి; వృష్ణులున్ = యాదవులు {వృష్ణులు - వృష్ణవంశపు యాదవులు}; ప్రేమన్ = ప్రేమతో; మీరలు = మీరు; భక్తిన్ = భక్తితో; ఏమున్ = మేము; ఇదె = ఇదిగో; చక్రిన్ = విష్ణుమూర్తిని {చక్రి – చక్రము ధరించిన వాడు, హరి}; కంటిమి = దర్శించితిమి; ఎట్లు = ఏ విధముగ; ఐనన్ = అయినప్పటికిని; ఉద్దామ = ఉన్నత మైన; ధ్యాన = ధ్యానముచే; గరిష్ఠుడు = శ్రేష్ఠుడు; ఐన = అయిన; హరిన్ = నారాయణుని; చెందన్ = పొంద; వచ్చు = సాధ్యము; ధాత్రీశ్వరా = రాజా {ధాత్రీశ్వరుడు - ధాత్రి (భూమి)కి ఈశ్వరుడు (ప్రభువు), రాజు}.

భావము:

ధర్మరాజా! మన్మథ వికారముతో గోపికలు, ప్రాణభయంతో కంసుడు, విరోధంతో శిశుపాలుడు మొదలైన రాజులు, దాయాదులు అయ్యి యాదవులు, బంధుప్రీతితో మీరు, భక్తితో మేము నిరంతర స్మరణలు చేసి విష్ణుసాయుజ్యం పొందాము కదా. ఏ విధంగా అయినా సరే విడవకుండా ధ్యానించి నారాయణుని పొందవచ్చును.
దుర్మార్గుడైన శిశుపాలుని ఆత్మ మరణానంతరం కృష్ణునిలో ఎలా లీనమైందని సందేహం వెలిబుచ్చిన యుధిష్టరునకు నారదులవారు, భగవంతుడికి వైషమ్య భావం అన్నది లేదు. ఎవరు శత్రువులు కారు, మిత్రులు కారు అందరూ సమానమే అని వివరిస్తూ చేసిన ఉపదేశంలోని భాగ మీ పద్యం.