పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఇంతింతై (8-622-శా.)

8-622-శా.

ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతైతోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతైచంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతైసత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

టీకా:

ఇంతింత = కొంచముమరికొంచము; ఐ = అయ్యి; వటుడు = బ్రహ్మచారి; ఇంత = మరికొంచము; ఐ = అయ్యి; మఱియున్ = ఇంకను; తాను = అతను; ఇంత = ఇంకొచము; ఐ = అయ్యి; నభోవీథి = ఆకాశము; పైన్ = మీద; అంత = అంత; ఐ = అయ్యి; తోయద = మేఘ; మండల = మండలమునకు; అగ్రమున్ = పైకొస; కున్ = కు; అల్లంత = ఆవతలంత; ఐ = అయ్యి; ప్రభారాశి = వెలుగులరాశి, పాలపుంత; పైన్ = కంటెఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; చంద్రుని = చంద్రుని; కిన్ = కి; అంత = అంత; ఐ = అయ్యి; ధ్రువుని = ధ్రువుడికంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; మహర్వాటిన్ = మహర్లోకముకంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; సత్యపద = బ్రహ్మలోకముకంటె; ఉన్నతుండు = ఎక్కువ ఎత్తు కలవాడు; అగుచున్ = అగుచు; బ్రహ్మాండ = బ్రహ్మాండము; అంత = చివరవరకు; సంవర్ధి = నిండాపెరిగినవాడు; ఐ = అయ్యి.

భావము:

బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారీ, కొంచం కొంచం ఎదగటం మొదలెట్టాడు. అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు. అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు. అదిగో మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు. పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు. అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడ దాటేసాడు. మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. చూడండి అప్పుడే మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు. ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో శ్రీమన్నారాయణ మహా ప్రభువు.భక్తివేదాంతాలతో అలవోకగా పండిత పామరులను అలరిస్తూ సాగే మన బమ్మెరవారి భాగవతంలో మధురాతి మధుర మైనది వామన చరిత్ర. మత్యావతా రాదులు ఎత్తి, మొట్టమొదటి మానవునిగా అవతరించిన పొట్టివాడైనా గట్టివాడిగా బ్రహ్మాండం అంతా వ్యాపించిన మహాద్భుత అవతార చరిత్ర ఇది. అంతేనా మహా మంత్ర పూరితం. కష్టనష్ట నాశకం. శుభప్రదాయకం. అంతటి కథకి సారాంశం ఈ పద్యం. పద్యం నడకలో, పద బందాలలో అలా పెరగటాన్ని ఎంతో అందంగా ప్రతిఫలింపజేసారు పోతనామాత్యులు.