పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : గురుభీష్మాదులు (1-367-మ.)

1-367-మ.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గురుభీష్మాదులు గూడి పన్నిన కురుక్షోణీశచక్రంబులో
గురుశక్తిన్ రథయంత యై నొగలపైఁ గూర్చుండి యా మేటి నా
ముల్ వాఱక మున్న వారల బలోత్సాహాయు రుద్యోగ త
త్పతల్ చూడ్కుల సంహరించె నమితోత్సాహంబు నా కిచ్చుచున్.

టీకా:

గురు = గురువు / ద్రోణుడు; భీష్మ = భీష్ముడు; ఆదులున్ = మొదలగువారు; కూడి = కలిసి; పన్నిన = రచించిన; కురు = కౌరవవంశపు; క్షోణీశ = రాజుల; చక్రంబు = (సైనికుల) దండు; లోన్ = లో; గురు = గొప్ప; శక్తిన్ = శక్తితో; రథయంత = సారథి; ఐ = అయ్యి (ఉండి); నొగల = రథమునకు ముందు భాగము; పైన్ = మీద; కూర్చుండి = కూర్చొని; ఆ = ఆ; మేటి = సమర్థుడు; నా = నాయొక్క; శరముల్ = బాణములు; వాఱక = వాడక; మున్న = ముందే; వారల = వారియొక్క; బల = బలము; ఉత్సాహ = ఉత్సాహము; ఆయుస్ = అయువు; ఉద్యోగ = ప్రయత్నములు; తత్పరతల్ = లక్ష్యములను; చూడ్కులన్ = చూపులతోనే; సంహరించెన్ = నాశనముచేసెను; అమిత = మిక్కిలి; ఉత్సాహంబున్ = ఉత్సాహమును; నాకు = నాకు; ఇచ్చుచున్ = ఇచ్చుచు.

భావము:

అత్యద్భుతమైన వజ్రపు తునక ఈ పద్యం. అర్జునుడు ద్వారకనుంచి వచ్చి శ్రీకృష్ణనిర్యాణం చెప్పలేకచెప్తూ తమ జీవనసారథిని తలుస్తున్నాడు.
భీష్మ ద్రోణాది మహాయోధులతో కూడిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో నాకు సారథ్యం చేస్తు, రథం నొగలపై కూర్చుండి నేను బాణ పరంపరలను వర్షింపక ముందే, తన చూపులతో శత్రువుల శక్తినీ, ఉత్సాహాన్నీ, ఆయుర్దాయాన్నీ, తదేకదీక్షనూ అపహరించి, నాకు అమితానందాన్ని అందించిన విజయ సారథి ఆయనే కదా.