పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఘను లాత్మీయ 10.(1-1710-మ.)

  •  
  •  
  •  

10.1-1710-మ.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నులాత్మీయ తమోనివృత్తికొఱకై గౌరీశుమర్యాద నె
వ్వనిపాదాంబుజతోయమందు మునుఁగన్ వాంఛింతు రే నట్టి నీ
నుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్నూఱుజన్మంబులున్
నినుఁజింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబ, ప్రాణేశ్వరా!

టీకా:

ఘనులు = గొప్పవారు; ఆత్మీయ = తమ యొక్క; తమః = అఙ్ఞానమును; నివృత్తి = తొలగించుకొనెడి; వృత్తిన్ = ఉపాయము; కొఱకు = కోసము; ఐ = అయ్యి; గౌరీశు = శివుని {గౌరీశుడు - గౌరి యొక్క ప్రభువు, శివుడు}; మర్యాదన్ = వలెనే; ఎవ్వని = ఎవరి యొక్క; పాద = పాదములనెడి; అంబుజ = పద్మముల; తోయము = తీర్థము; అందున్ = అందు; మునుగన్ = స్నానముచేయవలెనని; వాంఛింతురు = కోరుదురో; ఏనున్ = నేను కూడ; అట్టి = అటువంటి; నీ = నీ యొక్క; అనుకంపన్ = దయచేత; విలసింపనేని = మేలగకపోతే; వ్రత = వ్రతదీక్ష; చర్యన్ = వంటికార్యముగా; నూఱు = వంద (100); జన్మంబులున్ = రాబోవు జన్మములులో; నినున్ = నిన్ను; చింతించుచున్ = తలచుచు; ప్రాణముల్ విడిచెదన్ = చనిపోయెదను; నిక్కంబు = ఇది తథ్యము; ప్రాణేశ్వరా = నా పాణమునకు ప్రభువా.

భావము:

జీవితేశ్వరా! నాథా! పార్వతీపతి పరాత్పరుని పాదపద్మాల యందు ప్రభవించిన పవిత్ర గంగాజలాలలో ఓలలాడుతుంటాడు. మహాత్ములు అజ్ఞానరాహిత్యం కోరి, శంకరుని వలెనే, ఆ పరాత్పరుని పదజనిత గంగాజలాలలో ఓలలాడాలని కోరుతుంటారు. అటువంటి తీర్థపాదుడ వైన నీ అనుగ్రహాన్ని అందుకొని మనలేని ఎడల, బ్రహ్మచర్యదీక్షా వ్రతనిష్ఠ వహించి వంద జన్మలు కలిగినా సరే, నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ, తప్పక నా ప్రాణాలు నీకే అర్పిస్తాను సుమా!
రుక్మిణీ సందేశంలోని సుమథురమైన పద్యరాజం యిది. భాగవతమే మహా మహిమాన్వితం, అందులో రుక్మిణీ కల్యాణం మహత్వం ఎవరికైనా చెప్పతరమా. – ఆత్మేశ్వరా! పరమాత్మా! ఆత్మజ్ఞాన సంపన్నులు కూడ తమ హృదయాలలోని అవశిష్ఠ అజ్ఞానాంధకార నివారణ కోసం సాత్వికగుణం అభివృద్ధి చేసి తమోగుణం గ్రసించే బ్రహ్మవేత్త లాగ ఏ పరబ్రహ్మ అనే పవిత్ర జ్ఞాన గంగలో లయం కావాలని కోరతారో అట్టి పరబ్రహ్మతో ఈ జన్మలో ఉపరతి జెందలేనిచో ఎన్ని జన్మ లైనా పట్టుబట్టి విడువ కుండా మళ్ళీ మళ్ళీ మరణించే దాకా తపిస్తూనే ఉంటాను అంటున్నది రుక్మిణి అనే జీవాత్మ.