పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఎమ్మెలు చెప్పనేల (6-12-ఉ.)

6-12-ఉ.

మ్మెలు చెప్పనేల? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్
సొమ్ముగ వాక్యసంపదలు సూఱలు చేసినవాని భక్తి లో
మ్మినవాని భాగవత నైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో
మ్మెఱ పోతరాజుఁ గవిట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్.

టీకా:

ఎమ్మెలు = ప్రగల్భములు; చెప్పన్ = చెప్పుట; ఏల = ఎందులకు; జగము = లోకము; ఎన్నగన్ = కీర్తించగా; పన్నగరాజ శాయి = నారాయణుని {పన్నగరాజ శాయి - పన్నగరాజు (ఆదిశేషుని) శాయి (శయ్యగా కలవాడు), విష్ణువు}; కిన్ = కి; సొమ్ముగా = అలంకార మైన; వాక్య = మాటలనెడి; సంపదలు = సంపదలను; చూఱలుచేసిన వానిన్ = చూర కొనిన వానిని; భక్తిన్ = భక్తిగా; లో = మనసులో; నమ్మినవాని = నమ్మి నట్టివానిని; భాగవత = భాగవతులలో; నైష్ఠికుడు = నిష్ఠ గలవాడు; ఐ = అయ్యి; తగువానిన్ = తగినవానిని; పేర్మితో = ఆదరముతో; బమ్మెఱపోతరాజు = బమ్మెఱపోతనను; కవి = కవులలో; పట్టపురాజున్ = పట్టాభిషిక్తు డైన రాజుని; తలంచి = సంస్మరించి; మ్రొక్కెదన్ = కొలిచెదను.

భావము:

మొగమెచ్చుకబుర్లు కావు. జగము అంతా మెచ్చుకొనేలా శేషతల్పునికి తన కవితా సంపదలనే విభూషణాలు కోకల్లలుగా సమర్పించుకున్నవానిని. భక్తి విశ్వాసాలతో, పరమ నిష్ఠగా శ్రీమద్భాగవతాన్ని రచించిన తగువానిని కవిరాజులలో పట్టపురాజుని బమ్మెర పోత రాజుని తలచుకొని తలవంచి ప్రియమార నమస్కరించెదను.

  షష్ఠస్కంధారంభంలో సింగయకవి పోతనామాత్యుని తలచిన ప్రసిద్ధమైన తీరు.