పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఈశ్వరుండు (1-213-ఆ.)

1-213-ఆ.

శ్వరుండు విష్ణుఁ డెవ్వేళ నెవ్వని
కేమిసేయుఁ బురుషుఁ డేమి యెఱుఁగు
తనిమాయలకు మహాత్ములు విద్వాంసు
డఁగి మెలగుచుందు రంధు లగుచు.

టీకా:

ఈశ్వరుండు = ఈశ్వరుడు / కృష్ణుడు {ఈశ్వరుడు - ఈశత్వము (ప్రభుత్వము) కలవాడు}; విష్ణుఁడు = విష్ణువు / కృష్ణుడు; ఎవ్వేళ = ఏసమయమునకు; ఎవ్వని = ఎవని; కిన్ = కి; ఏమి = ఏమి; సేయున్ = చేయునో; పురుషుఁడు = మానవుడు; ఏమి = ఏమి; యెఱుఁగున్ = తెలియగలడు; అతని = అతనియొక్క; మాయలు = మహిమలు; కు = కి; మహాత్ములు = గొప్పఆత్మగలవారు; విద్వాంసులు = పండితులు; అడఁగి = లొంగి; మెలగుచూ = చరిస్తూ; ఉందురు = ఉందురు; అంధులు = గ్రుడ్డివారు; అగుచున్ = అవుతూ.

భావము:

పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఎవరికి ఏమి చేస్తాడో ఎవరు చెప్పగలరు. ఆ మహానుభావుని మాయలకు పెద్ద పెద్ద విద్వాంసులు సైతం దిక్కు తెలియనివారై, లోబడి అణిగి మణిగి ఉంటారు.