పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఈ హేమంతము రాకఁ (10.1-806-శా.)

10.1-806-శా.

హేమంతము రాకఁ జూచి రమణీహేలాపరీరంభ స
త్సాహాయ్యంబునఁగాని దీని గెలువన్ క్యంబుగా దంచుఁ దా
రూహాపోహవిధిం ద్రిమూర్తులు సతీయుక్తాంగులైనారు గా
కోహో!వారలదేమి సంతతవధూయోగంబు రాఁ గందురే?

టీకా:

ఈ = ఈ యొక్క; హేమంతము = చలికాలము; రాకన్ = వచ్చుటను; చూచి = చూసి; రమణీ = భార్యల యొక్క {రమణి - క్రీడింపదగినామె, స్త్రీ}; హేలా = విలాసపూరితమైన; పరిరంభ = ఆలింగనముల; సత్ = మంచి; సహాయ్యంబునన్ = తోడ్పాటువలన; కాని = తప్పించి; దీనిన్ = దీనిని; గెలువన్ = జయింప; శక్యంబుగాదు = వీలుకాదు; అంచున్ = అనుచు; తార్ = వారు; ఉహాపోహల = తర్కించినిర్ణయించుకొన్న; విధిన్ = విధముగా; త్రిమూర్తులు = బ్రహ్మవిష్ణుమహేశ్వరులు; సతీ = భార్యలతో; యుక్త = కూడిన; అంగులు = దేహములుకలవారు; ఐనారు = అయితిరి; కాకన్ = అలాకాని పక్షమున; ఓహో = ఔరా; వారలు = వారు; అది = అలా; ఏమి = ఎందుకు; సంతత = ఎడతెగని; వధూ = భార్యతో; యోగంబున్ = కూడియుండుటను; రాన్ = కలుగుటను; కందురే = పొందుదురా.

భావము:

హేమంత ఋతువు రావటం చూసి కామినుల విలాసవంతమైన బిగికౌగిళ్ళ తోడ్పాటుతో కాని దీని చలిని జయించటం వీలుపడ దన్నపోహ ఊహించుకొన్నట్లు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు సరస్వతీ, లక్ష్మీ, పార్వతులను ముగ్గురిని తమ తమ దేహాల యందే ధరించారు. ఔనౌను, ఇదే కారణం లేకపోతే ఆ త్రిమూర్తులు స్త్రీమూర్తుల సదా సాంగత్యం కలిగి ఉండరు కదా. - ఋతువర్ణన ప్రబంద లక్షణం. ఈ ప్రబంధానికి నాయకుడు భగవంతుడు. కర్త పోతన. ఈ ఋతువర్ణన కవితా మాధురి. ఆస్వాదించండి.