పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : దిటచెడి లోఁబడె (3-698-క)

3-698-క.

దిచెడి లోఁబడె దైత్యుఁడు
టికిన్ దంష్ట్రావిభిన్న త్రు మహోర
స్తటికిన్ ఖరఖురపుటికిం
టితటహత కమలజాండటికిం గిటికిన్.

టీకా:

దిట = పటుత్వము; చెడి = తప్పిపోయి; లోబడెన్ = లొంగెను; దైత్యుడు = హిరణ్యాక్షుడు {దైత్యుడు - దితి యొక్క పుత్రుడు, హిరణ్యకశిపుడు}; సటి = వరహావతారుని {సటి - జూలుకలది, అడవిపంది}; కిన్ = కి; దంష్ట్రావిభిన్నశత్రుమహోరస్తటి = వరహావతారుని {దంష్ట్రావిభిన్నశత్రుమహోరస్తటి - దంష్ట్రా (కోరలచే) విభిన్న (బద్ధలుకొట్టబడిన) శత్రువు యొక్క మహా (గొప్ప) ఉరస్తటి (వక్షస్థలము కలది), ఆదివరాహము}; కిన్ = కి; ఖరఖురపుటి = వరహావతారుని {ఖరఖురపుటి - ఖర (వాడి) యైన ఖుర (గిట్టలు) యొక్క పుటి (నేర్పుగల నడక కలది), ఆదివరాహము}; కిన్ = కి; కటితటహతకమలజాండఘటి = వరహావతారుని {కటితటహతకమలజాండఘటి - కటి (మొల) తట (భాగమున) హత (కట్టబడిన) కమలజాండ (బ్రహ్మాండము అను) ఘటి (గంటకలది), ఆదివరాహము}; కిన్ = కి {కమలజాండము - కమల (పద్మము)న జ (పుట్టినవాడు) (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కిటి = వరహావతారుని; కిన్ = కి;

భావము:

పటుత్వం కోల్పోయిన ఆ హిరణ్యాక్షుడు మెడమీద జూలుతో, శత్రువుల గొప్ప వక్షస్థలాన్ని బద్దలు కొట్టే కోరలతో, వాడియైన గిట్టల నైపుణ్యంతో, బ్రహ్మాండ భాండాన్ని పెటపెటలాడించే కటి ప్రదేశంతో అతి భయంకరంగా ఉన్న ఆ యజ్ఞవరాహానికి లొంగిపోయాడు.