పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : దండంబు (6-336-సీ.)

6-336-సీ.

దండంబు యోగీంద్రమండల నుతునకు;
దండంబు శార్ఙ్ఘ కోదండునకును;
దండంబు మండిత కుండల ద్వయునకు;
దండంబు నిష్ఠుర భండనునకు;
దండంబు మత్తవేదండ రక్షకునకు;
దండంబు రాక్షసఖండనునకు;
దండంబు పూర్ణేందు మండల ముఖునకు;
దండంబు తేజః ప్రచండునకును;

6-336.1-తే.

దండ మద్భుత పుణ్యప్రధానునకును;
దండ ముత్తమ వైకుంఠధామునకును;
దండ మాశ్రిత రక్షణ త్పరునకు;
దండ మురు భోగినాయక ల్పునకును.

టీకా:

దండంబు = నమస్కారము; యోగి = యోగులలో; ఇంద్ర = శ్రేష్ఠుల; మండల = సమూహములచే; నుతున్ = స్తుతింపబడెడివాని; కున్ = కి; దండంబు = నమస్కారము; శార్ఙ్ఘ = శార్ఙ్ఘము అనెడి; కోదండున్ = విల్లుగలవాని; కును = కి; దండంబు = నమస్కారము; మండిత = అలంకరింపబడిన; కుండల = చెవికుండలముల; ద్వయున్ = జంటగలవాని; కు = కి; దండంబు = నమస్కారము; నిష్ఠుర = అతికఠినమైన; భండనున్ = యుద్దముచేయువాని; కు = కి; దండంబు = నమస్కారము; మత్తవేదండ = గజేంద్రమును; రక్షకున్ = కాపాడినవాని; కున్ = కి; దండంబు = నమస్కారము; రాక్షస = రాక్షసులను; ఖండనున్ = సంహరించినవాని; కు = కి; దండంబు = నమస్కారము; పూర్ణ = నిండు; ఇందు = చంద్ర; మండల = మండలమువంటి; ముఖున్ = ముఖముగలవాని; కు = కి; దండంబు = నమస్కారము; తేజస్ = తేజస్సు; ప్రచండున్ = అతితీవ్రమైనదిగలవాని; కున్ = కి;
దండము = నమస్కారము; అద్భుత = అద్భుతమైన; పుణ్య = పుణ్యములను; ప్రధానున్ = ఇచ్చెడివాని; కును = కి; దండము = నమస్కారము; ఉత్తమ = శ్రేష్ఠమైన; వైకుంఠ = వైకంఠము; ధామున్ = నివాసముగాగలవాని; కును = కి; దండము = నమస్కారము; ఆశ్రిత = ఆశ్రయించినవారిని; రక్షణ = కాపాడుటయందు; తత్పరున్ = లగ్నమగువాని; కు = కి; దండము = నమస్కారము; భోగినాయక = ఆదిశేషుని {భోగినాయకుడు - భోగి (సర్పము)లకు నాయకుడు, శేషుడు}; తల్పున్ = పాన్పుగాగలవాని; కును = కి.

భావము:

యోగీంద్ర బృందవందిత, శార్ఙ్గమనే ధనస్సు ధరించిన స్వామీ నీకు నమస్కారం. కర్ణకుండలాలతో శోభిల్లే దేవదేవా, ఎదుర్కొన సాధ్యం కానంతటి యుద్ధం చేసే మహానుభావ నీకు దండము. గజేంద్రుని రక్షించినవాడ, రాక్షసులను శిక్షించినవాడ నీకు వందనం. చంద్రబింబం వంటి చక్కటి మోము గలవాడా, ప్రచండ మైన తేజస్సు గలవాడ నీకు ప్రణామం. అగణ్యపుణ్య స్వరూపా నమస్కారం. శ్రేష్ఠ మైన వైకుంఠధామమున నుండు దేవా దండం. ఆర్త జన రక్షణ తత్పరుడ వైన ప్రభూ వందనం. మహా గొప్ప ఆదిశేషునే తల్పంగా శయనించే పరాత్పర ప్రణామం.
వృత్రాసుర ఘట్టంలోనిది యిది. వృత్రాసురు విజృంభణానికి తట్టుకోలేక తల్లడిల్లుతున్నాయి దేవతా సమూహాలు. మహావిష్ణువును ప్రార్థించగా ప్రత్యక్షమయ్యారు. దేవతలు స్తుతిస్తున్నారు. ఆ స్తుతిలోని శబ్దాడంబరం ప్రస్ఫుటంగా కనబడుతున్న ఆ అమృత గుళిక యిది