పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : చిక్కడు వ్రతముల (7-243-క.)

7-243-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁ
జిక్కఁడు దానముల శౌచశీలతపములం
జిక్కఁడు యుక్తిని భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ!

టీకా:

చిక్కడు = దొరకడు; వ్రతములన్ = వ్రతములచేత; క్రతువులన్ = యజ్ఞములుచేత; చిక్కడు = దొరకడు; దానములన్ = దానములుచేయుటచేత; శౌచ = శుచి శుభ్రముల; శీల = మంచినడవడికల; తపములన్ = తపస్సులచేత; చిక్కడు = దొరకడు; యుక్తిని = తెలివిచేత; భక్తిని = భక్తివలన; చిక్కిన = దొరకిన; క్రియన్ = వలె; అచ్యుతుండు = హరి {అచ్యుతుడు - చ్యుతము (జారిపోవుట) లేనివాడు, విష్ణువు}; సిద్ధము = సత్యము; సుండీ = సుమా.

భావము:

భగవంతుడు గాఢ మైన భక్తికి వశమై నట్లు; నోములు, యగాలు, దానాలు, శుచిత్వాలు, మంచి నడవడికలు, తపస్సులు, యుక్తులు లాంటివి వాటికి వేటికీ వశము కాడు. భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందడానికి సాధనం. భక్తి వినా వేరు మార్గం లేనే లేదు.
దిగజారిపోవడమే లేనట్టి ఉన్నతతమ శాశ్వత స్థితిలో ఉండే భగవంతుడు ఇంకే మార్గంలో పట్టుకుందా మన్నా, బిగించే కొద్దీ వేళ్ళ మధ్యనుండి జారిపోయే నీళ్ళలా జారి పోతుంటాడు. భక్తికి అయితేనే భద్రంగా చిక్కుతాడు.
ఈ పద్యం ఎంతో గొప్పది అని చెప్పవచ్చు. భాగవత తత్వార్థాన్ని చిన్న చిన్న పదాల్లో సిద్దాంతీకరించి భక్తాగ్రేసరు డైన రాక్షసబాలుని నోట ఈ పద్యం రూపంలో ఇలా పలికించాడు పోతన గారు. ప్రహ్లాదుడు సహాధ్యాయులు అయిన రాక్షసబాలురకు తన ప్రపత్తిమార్గ మైన నారదోపదిష్ట భాగవతతత్వాన్ని తెలిపి విష్ణుభక్తి విలక్షణత వివరించాడు.