పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : చలమున నను డాసి (10.1-1343-సీ.)

10.1-1343-సీ.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లమున నను డాసి లరాశిఁ జొరరాదు;
నిగిడి గోత్రముదండ నిలువరాదు;
కేడెంచి కుంభిని క్రిందికిఁ బోరాదు;
నుజసింహుఁడ నని లయరాదు;
చేరినఁ బడవైతుఁ జెయి చాపఁగారాదు;
బెరసి నా ముందటఁ బెరుఁగరాదు;
భూనాథ హింసకుఁ బోరాదు నను మీఱి;
శోధింతుఁ గానలఁ జొరఁగరాదు;

10.1-1343.1-ఆ.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రబలమూర్తి ననుచు భాసిల్లఁగారాదు;
రఁ బ్రబుద్ధుఁడ నని ఱుమరాదు;
లికితనము చూపి ర్వింపఁగారాదు;
రముగాదు; కృష్ణ! లఁగు తలఁగు.

టీకా:

చలమున = పట్టుదలతో; ననున్ = నన్ను; డాసి = ఎదిరించి; జలరాశిన్ = సముద్రము నందు; చొరరాదు = దూరకూడదు (మత్యావతారుడవై); నిగిడి = అతిశయించి, నిక్కి; గోత్రము = కొండ (మంథర)కు; దండ = ఆధారముగ; నిలువరాదు = ఉండకూడదు (కూర్మావతారుడవై); కేడెంచి = మారుమొగము పెట్టుకొని; కుంభిన్ = భూమి; క్రింది = కింద; కిన్ = కి; పోరాదు = పోకూడదు (కూర్మావతారుడవై); మనుజసింహుడను = నరులలో సింహమును; అని = అని; మలయరాదు = మెలగకూడదు (నరసింహావతారుడవై); చేరినన్ = దగ్గరకొస్తే; పడవైతున్ = పడదోసెదను; చెయి = చెయ్య, హస్తము; చాపగారాదు = చాపకూడదు; బెరసి = చేరి; నా = నా; ముందటన్ = ఎదుట; పెరుగరాదు = ఎదగ కూడదు (త్రివిక్రముడవై); భూనాథ = రాజులను; హింస = చంపుట; కున్ = కు; పోరాదు = పోకూడదు (పరశురాముడవై); ననున్ = నన్ను; మీఱి = దాటి; శోధింతున్ = వెదకిపట్టుకొనెదను; కానలన్ = అడవులలో; చొరగరాదు = దూరకూడదు (శ్రీరామావతారుడవై).
ప్రబలమూర్తిని = గొప్పబలముకలవాడను; అనుచున్ = అని; భాసిల్లగారాదు = ప్రకాశింపకూడదు (బలరామావతారుడవై); ధరన్ = భూలోకమున; ప్రబుద్ధుడను = మిక్కలిబుద్ధికలవాడను; అని = అని; తఱుమరాదు = తరిమేయకూడదు (బుద్ధావతారుడవై); కలికితనము = చాతుర్యము; చూపి = కనబరచి; గర్వింపగరాదు = అహంకరింపకూడదు (కల్క్యవతారుడవై); తరముగాదు = నీకు శక్యముకాదు; కృష్ణ = కృష్ణుడా; తలగుతలగు = తొలగిపొమ్ము.

భావము:

ఓ కృష్ణా! పౌరుషానికి పోయి నా దగ్గరకి వచ్చేక ఇక వేషాలేసి నాటకాలాడి తప్పించుకు పోడానికి అవకాశం ఉండదు జాగ్రత్త. తర్వాత (మత్యావతారంలో లా చేపలా వేషం కట్టి) సముద్రంలోకి పోడానికీ కుదరదు. (కూర్మావతారంలో మంథర పర్వతానికి కింద నిలబడి ఆధారంగా ఉన్నా నని తాబేలు వేషం కట్టి) కొండల దన్ను తీసుకోడానికీ అవ్వదు. (వరహావతారంలో భూమిని ధరించి దాని కిందున్నా కదా అని పంది వేషం కట్టి) తప్పించుకుపోయి భూమి కిందకి దూరడానికీ వీలవదు. (నరసింహావతారం ఎత్తిన వాడిని కదా అని) సింహంలాంటి మగాణ్ణి అన్ని విర్రవీగడానికీ కుదరదు. (వామనావతారంలో చెయ్యి చాచడం అలవాటే అనుకోకు) దగ్గరకొస్తేనే పడదోసేస్తా. ఇక చెయ్యి చాచడానికి కూడ సందుదొరకదు. (త్రివిక్రమావతారం ఎత్తి పెరిగా కదా అని) నా ఎదురుగా పెచ్చుమీరడమూ అలవికాదు. (పరశురామావాతారంలో రాజులను చంపేసా అనుకోకు) నన్ను దాటి రాజుని హింసించడ మన్నది సాధ్యం కాదు. (రామావతారంలో అడవులకు పోయా కదా అని) అవసరమైతే అరణ్యంల్లో దాక్కుంటా అనుకోకు, గాలించి మరీ పట్టుకుంటా. (బలరామావతారం ఎత్తిన) ప్రబలమైన ఆకారం కలవాడను నేనే అని విర్రవీగడానికీ వీలుండదు. (బుద్ధావతారం ఎత్తిన వాడిని) పుడమిలో నేనే ప్రబుద్ధుణ్ణి అని బెదిరించి తరిమేద్దాం అనీ (కల్కి అవతారం ఎత్తుతా కదా అని) కపటంతో జయించేస్తా అని గర్వించటమూ వీలుకాదు సుమా. నాతో యుద్ధం చేయడం నీ తరంగాదులే, పో కృష్ణా! పారిపో.