పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : అటమటమయ్యె (1-374-చ.)

1-374-చ.

మటమయ్యె నా భజన మంతయు భూవర! నేఁడు సూడుమా
యిటువలె గారవించు జగదీశుఁడు గృష్ణుఁడు లేని పిమ్మటం
టుతర దేహలోభమునఁ బ్రాణములున్నవి వెంటఁబోక నేఁ
కట! పూర్వజన్మమునఁ ర్మము లెట్టివి చేసినాఁడనో?

టీకా:

అటమటము = గజిబిజి / వృథా; అయ్యెన్ = అయ్యెను; నా = నా యొక్క; భజనము = పూజలు; అంతయు = మొత్తము అంతా; భూవర = భూమికి భర్తా / రాజా; నేఁడు = ఇవాళ; సూడుమా = చూడవోయి; ఇటువలె = ఇలా; గారవించు = ఆదరించు / గారాబము చేయు; జగధీశుఁడు = జగత్తునకు ఈశుడు; కృష్ణుఁడు = కృష్ణుడు; లేని = లేకపోయిన; పిమ్మటన్ = తరువాత కూడ; పటుతర = చాలా గట్టిదైన {పటు - పటుతరము - పటుతమము}; దేహ = శరీరము మీది; లోభమునన్ = పిసినారితనముతో / మమకారముతో; ప్రాణములు = ప్రాణములు; ఉన్నవి = ఉన్నవి; వెంటన్ = కూడా; పోకన్ = వెళ్ళకుండగనే; నేన్ = నేను కటకట = అయ్యయ్యో; పూర్వ = క్రిందటి; జన్మమునన్ = జన్మలలో; కర్మములు = పాపం పనులు; ఎట్టివి = ఎలాంటివి; చేసినాఁడనో = చేసానో.

భావము:

అర్జునుడు అన్న ధర్మరాజుకి కృష్ణ నిర్యాణం చెప్తున్నాడు – అయ్యయ్యో నా సేవ అంతా నిరర్థకం అయిపోయింది మహాప్రభో! చూడు ఇవాళ, ఇలా ఆప్యాయంగా నన్ను ఆదరించే విశ్వేశ్వరుడు శ్రీకృష్ణుడు ఈ లోకం విడిచి వెళ్ళిపోయాక కూడ ఇంకా నాప్రాణాలు ఆయన వెంట పోకుండ ఉన్నాయి. దేహం మీద ఇంతటి లోభం ఉందంటే పూర్వ జన్మలలో ఎంతటి పాపకృత్యాలు చేసానో కదా.