పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఆదరమొప్ప ( 1-5-ఉ. )

1-5-ఉ.

ర మొప్ప మ్రొక్కిడుదు ద్రి సుతా హృదయానురాగ సం
పాదికి దోషభేదికిఁ బ్రన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నంద వేదికిన్
మోకఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్.

టీకా:

ఆదరము = మన్నన; ఒప్పన్ = ఉట్టిపడేలా; మ్రొక్కున్ = నమస్కారమును; ఇడుదున్ = పెట్టెదను; అద్రి = పర్వత; సుతా = పుత్రి; హృదయ = హృదయ; అనురాగ = అనురాగాన్ని; సంపాది = సంపాదించినవాడు; కిన్ = కి; దోష = పాపాలని; భేది = పోగొట్టేవాడు; కిన్ = కి; ప్రపన్న = శరణాగతులైన భక్తులకు; వినోది = సంతోషము కలిగించు వాడు; కిన్ = కి; విఘ్న = విఘ్నాల; వల్లికా = సమూహమును; చ్ఛేది = నాశనముచేసే వాడు; కిన్ = కి; మంజు = మనోజ్ఞముగ; వాది = మాట్లాడే వాడు; కిన్ = కి; అశేష = అనేక; జగత్ = లోకములందలి; జన = జనులకు; నంద = ఆనందము; వేది = కలిగించే వాడు; కిన్ = కి; మోదక = ఉండ్రాళ్ళు; ఖాది = తిను వాడు; కిన్ = కి; సమద = చక్కగ; మూషక = ఎలుక; సాది = నడిపే వాడు; కిన్ = కి; సుప్రసాది = మంచి నిచ్చే వాడు; కిన్ = కి.

భావము:

పర్వతరాజు హిమవంతుని కుమార్తె ఉమాదేవి మాతృప్రేమ అనే సంపదను సంపాదించిన వాడు, సకల పాపాలను విరిసిపోయేలా చేసేవాడు, ఆపన్నుల విన్నపాలను ఆమోదించువాడు, సమస్త విఘ్నలనే బంధనాలు ఛేదించు వాడు, మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించువాడు, నివేదించిన కుడుములూ ఉండ్రాళ్లూ కడపునిండా ఆరగించి మూషకరాజును అధిరోహించి విహరించువాడు, ముల్లోకాలకూ శుభాలు ప్రసాదించి విరాజిల్లువాడు ఐన వినాయకునకు వంగి వంగి నమస్కరిస్తున్నాను.