పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : అడిచితివో (1-357-క.)

1-357-క.

డిచితివో భూసురులను;
గుడిచితివో బాలవృద్ధగురువులు వెలిగా;
విడిచితివో యాశ్రితులను;
ముడిచితివో పరుల విత్తములు లోభమునన్;

టీకా:

అడిచితివో = అణగ్గొట్టితివా ఏమిటి; భూసురులను = బ్రాహ్మణులను {భూసురులు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; కుడిచితివో = తింటివా ఏమిటి; బాల = పిల్లలను కాని; వృద్ధ = ముసలివారిని కాని; గురువులు = గురువులను కాని; వెలిగా = విడిచి పెట్టి; విడిచితివో = విడిచిపెట్టావా ఏమిటి; ఆశ్రితులను = ఆశ్రయించినవారిని; ముడిచితివో = మూటగట్టితివా ఏమిటి; పరుల = ఇతరుల; విత్తములు = ధనములను; లోభమునన్ = పిసినారితనముతో.

భావము:


ఆరాధ్యులైన భూసురులను అణచివేసావా, లేకపోతే బాలురకు వృద్ధులకు గురువులకు పెట్టకుండా కుడిచినావా, శరణని చేరిన వారిని కాపాడకుండా వదలిపెట్టావా, పోనీ పరుల ధనాలను లోభం కొద్దీ ముడిచేసావా; తప్పు చేసినవాడికి కాని నీ కెందుకయ్యా యీ విచారం.