పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఆఁకలిగొన్న క్రేపులు (13-400-ఉ)

13-400-ఉ.

ఆఁలి గొన్న క్రేపులు రయంబున నీకలురాని పక్షులున్
దీకొని తల్లికిన్ మఱి విదేశగతుండగు భర్త కంగజ
వ్యాకులచిత్త యైన జవరాలును దత్తఱ మందు భంగి నో!
శ్రీర! పంకజాక్ష! నినుఁ జేరఁగ నామది గోరెడుం గదే.

టీకా:

ఆఁకలి గొన్న - ఆకలి = ఆకలి; కొన్న = వేస్తు న్నట్టి; క్రేపులు = దూడలు; రయంబున నీకలు రాని - రయంబునన్ = శ్రీఘ్రముగను; ఈకలు = రెక్కలు; రాని = రానట్టి; పక్షులున్ = పక్షిపిల్లలు; దీకొని = పూని; తల్లి కిన్ - తల్లి = తల్లి; కిన్ = కి; మఱి = మఱి; విదేశ గతుం డగు - విదేశ = పరాయి దేశములకు; గతుండు = వెళ్ళిన వాడు; అగు = అయిన; భర్త కంగజ - భర్తన్ = భర్త; కున్ = కోసము; అంగజ = మన్మథుని వలన; వ్యాకుల చిత్త యైన - వ్యాకుల = వ్యాకులమైన; చిత్త = మనసు గలది; ఐన = అయిన; జవరాలును దత్తఱ మందు - జవరాలునున్ = స్త్రీ; తత్తఱము = తొందర; అందు = పడెడి; భంగినో - భంగిన్ = వలెనే; ఓ = ఓ; శ్రీకర = హరి {శ్రీకర - శ్రీ (శుభములను) కర (కలిగించెడివాడ), విష్ణువు}; పంకజాక్ష = హరి {పంకజాక్షుడు - పంకజము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; నినుఁ జేరఁగ - నినున్ = నిన్ను; చేరగన్ = చేరవలె నని; నా మది గోరెడుం గదే - నా = నా యొక్క; మదిన్ = మనసులో; కోరెడుం గదే = కోరెదను గాక.

భావము:

వృత్రాసుర వృత్తాంతం భాగవత అంతరార్థానికి ఒక చక్కటి ఉదాహరణ, విశేష్ఠ మైన భక్తి పరాకాష్టను వివరించే చక్కటి కథ. వృత్రాసురుడు అరివీర భయంకర ప్రతాపం తో యుద్దం చేస్తున్నాడు. భగవంతుని అనుగ్రహం సంపాదించిన ఇంద్రుడు అతనిని వజ్రాయుధంతో సంహారం చేయ బోతున్నాడు. అప్పుడు వృత్రాసురుడు భగవంతుని చేసిన ప్రార్థన ఒకటి. – ఓ సకల శుభాల సంధానకర్తా! శ్రీహరీ! పుండరీకాక్ష! ఆకలితో అలమటించే లేగదూడలు గోమాత కోసం ఎదురు చూస్తుందో, నిరీక్షిస్తున్న రెక్కలు రాని పక్షిపిల్లలు తల్లి కోసం ఆత్రుతతో ఎలా ఎదురు చూస్తాయో ఇంకా విదేశ గతుడు అయినట్టి పతి కోసం విరహవ్యాకులత చెందిన సతి ఎలా ప్రతీక్షిస్తుందో అలా నీ కోసం, నీ సమాగమం కోసం నా మది ఉవ్విళ్ళూరు తున్నదయ్యా.