పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : అవిద్యా పంచకం

అవిద్యాపంచకం – అజ్ఞాన పఞ్చకం

3-367-వ.

  • 1. మోహం – అహమ్మను దేహాభిమాన బుద్ధి – అహంకార పూరితమైన దేహాభిమానం
  • 2. మహామోహం – అంగనా సంగమ స్రక్చందనాది గ్రామ్య భోగేచ్ఛలు – దేహాభిమానం వలన స్త్రీ సంభోగం, దేహాలంకారలు మొదలైన గ్రామ్యభోగాలు పై ఆసక్తి
  • 3. అంధతామిస్రం – తత్ప్రతిఘాతంబు అయిన క్రోధంబునందు కలుగునది – గ్రామ్యభోగాలకు కలిగే విఘ్నాలు వలన జనించే క్రోధంతో పుట్టే అజ్ఞానం లేదా చీకటి
  • 4. తామిస్రం – తన్నాశంబున అహమేవా మృతోస్మి అని కలిగే మహా భయం - శరీరమోహం వలన ఏర్పడే శరీరనాశన భయం మృత్యుభీతి నేను చచ్చిపోతాను అనే భయం
  • 5. చిత్తభ్రమ – మానసిక సంచలనం – మోహం, మహామోహం, అంధతామిస్రం, తామిస్రం అనే ఈ నాలుగింటి వలన మనస్సుకు కలిగే సంచలనం

గమనిక :-
ఈ సందర్భంలో శంకరభగవత్పాదులు వారి అజ్ఞాన పంచకం స్మరించండి.

ఓం శ్రీ గురుభ్యోనమః
అజ్ఞాన పఞ్చకమ్ - - - {మాయా పఞ్చకమ్}

నిరుపమనిత్యనిరంశకే2ప్యఖణ్డే
. . . . . . మయి చితి సర్వవికల్పనాదిశూన్యే
ఘటయతి జగదీశజీవభేదం
. . . . . . త్వఘటితఘటనాపటీయసీమాయా


నిత్యుడను, నిరుపముడను, నిర్ అంశుడను అఖండుడను స్వయం జ్ఙానస్వరూపుడను అయిన నాయందు ఈ మాయ అజ్ఞానమును కలిగించి, జగత్తు, ఈశ్వరుడు, జీవుడు అను భేదాన్ని కలిగిస్తోంది. ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.?

శ్రుతిశతనిగమాన్తశోధకాన
. . . . . . ప్యహహ ధనాదిదర్శనేన సద్యః
కలుషయతి చతుష్పదాద్యభిన్నాన్
. . . . . . త్వఘటితఘటనాపటీయసీమాయా


వేదవాక్యములతోనూ, ఉపనిషద్ సూక్తులతోనూ ప్రభోధముచేసి చతుష్పాదులైన పశుపక్షాదులు జంతువులనుండి వేరుగా సంస్కరింపజేసినా కూడా ఆహా ఈ మాయ గొప్పదన మేమో. వారికి వెంటనే భోగింపదగు ధనమాది సమస్త వస్తువులను చూపించి అవి పొందడం పోగొట్టుకోవడం అనే విషయములచే కలుషితులను కావిస్తోంది. ఈ మాయ ఎన్నడూ ఘటించని దాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది?

సుఖచిదఖణ్డవిబోధమద్వితీయం
. . . . . . వియదనలాదివినిర్మితే నియోజ్య
భ్రమయతి భ్రమసాగరే నితాన్తం
. . . . . . త్వఘటితఘటనాపటీయసీమాయా


అఖండ సచ్చిదానంద సుఖబోధస్వరూపమైన ఆత్మను ఈ మాయ ఆకాశాది పంచభూతనిర్మితమగు ఈ భవసాగరములో పడేసి, నిరంతరమూ కొట్టుకునేటట్లు చేస్తోంది. ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.?

అపగతగుణజాతివర్ణభేదే
. . . . . . సుఖచితి విప్రవిదాద్యహఙ్కృతిం చ
స్ఫుటయతి సుతదారగేహమోహం
. . . . . . త్వఘటితఘటనాపటీయసీమాయా


ఈ మాయ ఎంత గొప్పది, గుణ వర్ణ జాతి అనే భేద రహితుడైన, సుఖ చిత్ స్వరూపుడైన ఆత్మ యందు బ్రాహ్మణాది చాతుర్వ ర్ణాది రూపమగు అహంకారాన్ని, భార్య, భర్త, కొడుకు, ఇల్లు అనే మోహాలను కలిగిస్తోంది. ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది?

విధిహరహరివిభేదమప్యఖణ్డే
. . . . . . బత విరచయ్య బుధానపి ప్రకామమ్
భ్రమయతి హరిహరభేదభావా
. . . . . . త్వఘటితఘటనాపటీయసీమాయా


అఖండస్వరూపమైన బ్రహ్మంలో బ్రహ్మవిష్ణుశివ ఇత్యాది భేధములను నిర్మించి, బుధజన శ్రేష్ఠులు ఐన వారిని కూడా శివవిష్ణుభేదబుద్ధులుగా మార్చి ఆ భ్రమను కల్పిస్తూ ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది కదా!

ఇతి శ్రీమచ్ఛంకరభగవత్పాద విరచిత మాయా పఞ్చకమ్
సాష్టాంగ నమస్కారం