పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కర్మములు

  • * కారణశరీరము – 1) అజ్ఞాన రూపమగు దేహము, 2) స్థూల సూక్ష్మ దేహములకు లోనుండి మఱియొక దేహమును ఇచ్చుటకు హేతువు అగు దేహము. (శబ్ధార్థచంద్రిక)
  • * లింగశరీరము – లింగదేహము – మరణానంతరము లోకాంతరమున సుఖదుఃఖములు అనుభవించుటకు జీవుడు ధరించు. సూక్ష్మశరీరము(శబ్ధార్థచంద్రిక)
  • * కారణము – క్రియానిష్పాదకమైన హేతువు.
  • * కార్య లింగం - ప్రారబ్దలింగ శరీరము - ప్రకృతి లక్షణముల ద్వారా కలిగినది ప్రారబ్దము - ప్రారబ్దం వలన కలిగిన లింగ దేహం;
  • * ప్రారబ్దం ఆరంభింపబడిన పూర్వం చేసిన కర్మ ఫలం; ఇప్పటి దేహానికి కారణమైన కర్మ ప్రారంభ కర్మ. ఇది స్వేచ్ఛాప్రారబ్ధమనీ, పరేచ్ఛా ప్రారబ్ధమనీ రెండు విధాలు. స్వేచ్ఛా ప్రారబ్ధంలో తన ఇచ్ఛ ప్రకారం, పరేచ్ఛా ప్రారబ్ధంలో ఇతరుల ఇష్టప్రకారం అనుభవాలు కలుగుతుంటాయి, కార్యకలాపాలు జరుగుతుంటాయి. పరేచ్ఛా ప్రారబ్ధం అనుభవిస్తున్నప్పుడు సాధకుడు సమాధిలో ఉన్నప్పటికీ ఇతరుల ఇష్ట ప్రకారమే స్నానపానాదులు సైతం జరుగుతుంటాయి.
  • * కర్మ సిద్ధాంతం - చేసిన కర్మలను బట్టి శుభాశుభ కర్మ ఫలాలను అనుభవించ వలసి వస్తుంది. అదే జన్మలోనో కాకపోతే తరువాత జన్మలోనో, అనుభవించ వలసి వస్తుంది. సత్కర్మలకు సత్ఫలం, దుష్కర్మలకు దుష్ఫలం తప్పదు.
  • * కర్మపాకము, కర్మవిపాకము - పూర్వము నందు చేసిన కర్మములు పరిపాకమై ఫలమునిచ్చుటకు సిద్ధము అగుట
  • * కర్మఫలము – శుభాశుభ కర్మముల యొక్క సుఖదుఃఖాది రూపమగు ఫలము. (శబ్ధార్థ చంద్రిక)
  • * కర్మ - ప్రతి జీవీ చేసే పని. ఇలా చేసే పనులు,
  • * కర్మ సంచితమనీ, ప్రారబ్ధమనీ, ఆగామి అనీ మూడు విధాలు అని వైదిక ధర్మం.
  • సంచితం అంటే కూడబెట్టుకొన్నది.
  • ప్రారబ్ధం అంటే కూడబెట్టుకొన్న దానిని అనుభవంలోకి తెచ్చుకోవడం.
  • ఆగామి అంటే ఈ జన్మలో చేసే పనులతో కూడబెట్టుకొనబోయేది (అంటే, సంపాదించుకొంటున్నది). ఆగామికే మరో పదం క్రియమాణం.
  • * కర్మలు లౌకికం అనీ, అలౌకికం (వేదోక్తం) అనీ రెండు విధాలు.
    • జీవిక కోసం చేసే పనులు లౌకికం.
    • ఈశ్వరారాధన మొదలైనవి అలౌకిక కర్మలు.
  • * కర్మలకు నిత్య, నైమిత్తిక, కామ్య, నిషేధ కర్మలనే మరో వర్గీకరణ ఉంది.
    • నిత్యకర్మలు అంటే రోజూ చేసేవి.
    • అమావాస్యనాడు ఫలానా యాగం చేయాలి. పౌర్ణమినాడు ఫలానా పనిచేయాలని చెప్పినందున చేసేవి నైమిత్తిక కర్మలు.
    • ఫలానా కర్మ చేస్తే ఫలానా ఫలితం వస్తుందని చేసేది కామ్యకర్మ. ఉదాహరణ జ్యోశిష్టోమం చేస్తే స్వర్గం ప్రాప్తిస్తుందనీ పుత్రకామేష్టి చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చేసేవి, చేయించేవి.
    • అసత్యం పలకవద్దని, పరస్త్రీని ఆశించవద్దనీ చెప్పేది నిషేధకర్మలు.
  • * కర్మ అంటే పని అని స్థూలంగా అర్థం. ప్రతి పనికీ ఫలితం ఉంటుంది. అలాగే ఒక కారణం ఉంటుంది. మొక్కకు బీజం కారణం. అది ప్రాధమిక కారణమైతే మొక్క మొలిచి పెరగడానికి దోహదం చేసే నీరు, ఎండ, గాలి మొదలైనవి రెండవ స్థాయి కారణాలు. మనిషికి కలిగే ప్రతి ఆలోచన, అతడు పలికే ప్రతి మాట, అతడు చేసే ప్రతి పనీ తగిన సమయాలలో ఫలితానికి వస్తాయి. ఈ విధమైన కర్మ ఫలం గాక, అతడు ఏ జీవులలో పుట్టాడో, ఆ జీవి లింగం ఏమిటో, అది ఏ జాతో మొదలైన కారణాలతో స్థిర కర్మ అనేదొకటి కూడా ఉంటుంది. కర్మ ఫలం ఈ జీవితంలోనే అనుభవానికి రావచ్చు, మరు జన్మలోనూ రావచ్చు. ఇందులో ప్రాధమిక, ద్వితీయ స్థాయి కారణాలు ఉంటాయి.