స్తుతులు స్తోత్రాలు : విష్ణు సర్వాంగ స్తోత్రము (సర్వాభీష్ట ప్రదం)
విష్ణు సర్వాంగ స్తోత్రము (సర్వాభీష్ట ప్రదం)
దళ దరవింద సుందర పత్రరుచిరాక్షు;
సలలిత శ్రీవత్సకలితవక్షు
నీలనీరద నీలనీలోత్పలశ్యాము;
నలికులాకుల మాలికాభిరాముఁ
గౌస్తుభకలిత ముక్తాహారయుతకంఠు;
యోగిమానస పంకజోపకంఠు
సతతప్రసన్నసస్మితవదనాంభోజు;
దినకరకోటి సందీప్తతేజు
సలలితానర్ఘ్య రత్న కుండల కిరీట
హారకంకణ కటక కేయూరముద్రి
కాతులాకోటి భూషు భక్తప్రపోషుఁ
గింకిణీయుత మేఖలాకీర్ణజఘను.
మఱియు,
కంజాతకింజల్క పుంజరంజిత పీత;
కౌశేయవాసు జగన్నివాసు
శత్రుభీకర చక్ర శంఖ గదాపద్మ;
విహిత చతుర్భాహు విగతమోహు
నుతభక్తలోక మనోనేత్రవర్ధిష్ణు;
లాలిత సద్గుణాలంకరిష్ణు
వరకుమారక వయఃపరిపాకు సుశ్లోకు;
సుందరాకారు యశోవిహారు
సకలలోక నమస్కృతచరణకమలు
భక్తలోక పరిగ్రహప్రకటశీలు
దర్శనీయ మనోరథదాయిఁ గీర్త
నీయ తీర్థయశోమహనీయమూర్తి.
వెండియు.
అనుపమగుణ సంపూర్ణుని
ననఘుని సుస్థితుని గతుని నాసీను శయా
నునిభక్తహృద్గుహాశయ
నునిసర్వేశ్వరు ననంతు నుతసచ్చరితున్.
విమలంబై పరిశుద్దమై తగు మనోవిజ్ఞాన తత్త్వప్రబో
ధమతిన్ నిల్పి తదీయమూర్తి విభవధ్యానంబు గావించి చి
త్తముసర్వాంగ విమర్శనక్రియలకుం దార్కొల్పి ప్రత్యంగమున్
సుమహాధ్యానము సేయఁగావలయుఁబో శుద్ధాంతరంగంబునన్.
అది యెట్టి దనిన.
హల కులిశాంకుశ జలజధ్వజచ్ఛత్ర;
లాలిత లక్షణలక్షితములు
సలలిత నఖచంద్రచంద్రికా నిర్ధూత;
భక్తమానస తమఃపటలములును
సురుచిరాంగుష్ఠ నిష్ఠ్యూత గంగాతీర్థ;
మండిత హరజటామండలములు
సంచిత ధ్యానపారాయణజన భూరి;
కలుష పర్వత దీపకులిశములును
దాసలోక మనోరథదాయకములు
జారుయోగి మనఃపద్మ షట్పదములు
ననగఁ దనరిన హరిచరణాబ్జములను
నిరుపమధ్యానమున మది నిలుపవలయు.
కమలజు మాతయై సురనికాయ సమంచిత సేవ్యమానయై
కమలదళాభనేత్రములు గల్గి హృదీశ్వర భక్తి నొప్పు న
క్కమల నిజాంకపీఠమునఁ గైకొని యొత్తు పరేశుజాను యు
గ్మముహృదయారవిందమున మక్కువఁ జేర్చి భజింపగా దగున్.
చారువిహంగవల్లభు భుజంబులమీఁద విరాజమానసు
శ్రీరుచినుల్లసిల్లి యతసీకుసుమద్యుతిఁ జాల నొప్పు పం
కేరుహనాభు నూరువుల కిల్బిషభక్తి భజించి మానసాం
భోరుహ మందు నిల్పఁదగుఁబోమునికోటికి నంగనామణీ!
పరిలంబిత మృదుపీతాం
బరకాంచీగుణ నినాదభరితం బగున
ప్పురుషోత్తముని నితంబముఁ
దరుణీ! భజియింపవలయు దద్దయుఁ బ్రీతిన్
వినుభువనాధారత్వం
బునఁదగి విధిజననహేతుభూతంబగున
వ్వనజాతముచేఁగడుమిం
చినహరినాభీసరస్సుఁజింతింపఁదగున్
దివ్య మరకతరత్న సందీప్త లలిత
కుచములను మౌక్తికావళిరుచులఁ దనరి
యిందిరాదేవి సదనమై యెసక మెసఁగు
వక్షమాత్మను దలపోయవలయుఁ జుమ్ము.
నిరతంబున్ భజియించు సజ్జన మనోనేత్రాభిరామైక సు
స్థిరదివ్యప్రభ గల్గు కౌస్తుభరుచిశ్లిష్టంబునై యొప్పు నా
వరయోగీశ్వరవంద్యమానుఁ డగు సర్వస్వామి లక్ష్మీశు కం
ధరమాత్మం గదియించి తద్గుణగణధ్యానంబుసేయం దగున్.
ఘనమందరగిరి పరివ
ర్తననికషోజ్జ్వలిత కనకరత్నాంగదముల్
దనరార లోకపాలకు
లనుగలిగిన బాహు శాఖలను దలఁపఁదగున్.
మఱియు విమత జనాసహ్యంబులైన సహస్రారంబులు గలుగు సుదర్శనంబును, సరసిజోదరకరసరోరుహం బందు రాజహంస రుచిరం బయిన పాంచజన్యంబును, నరాతిభటశోణిత కర్దమలిప్తాంగంబై భగవత్ప్రీతికారణి యగు కౌమోదకియును, బంధుర సుగంధ గంధానుబంధ మంథర గంధవహాహూయమాన పుష్పంధయ ఝంకార నినద విరాజితం బైన వైజయంతీ వనమాలికయును, జీవతత్త్వం బైన కౌస్తుభమణియును, బ్రత్యేకంబ ధ్యానంబు సేయందగు; వెండియు, భక్త సంరక్షణార్థం బంగీకరించు దివ్యమంగళవిగ్రహంబున కనురూపంబును, మకరకుండల మణి నిచయ మండిత ముకురోపమాన నిర్మల గండమండలంబును, సంతత శ్రీనివాస లోచనపంకజకలితంబును, లాలిత భ్రూలతాజుష్టంబును, మధుకర సమానరుచి చికురవిరాజితంబును నైన ముఖకమలంబు ధ్యానంబు గావింపవలయు; మఱియు, శరణాగతుల కభయప్రదంబు లగుచు నెగడు పాణిపంకేరుహంబుల మనంబునఁ దలఁపవలయు.
గురుఘోరరూపకంబై
పరఁగెడు తాపత్రయం బుపశమింపఁగ శ్రీ
హరిచేత నిసృష్టము లగు
కరుణాలోకములఁ దలఁపఁగాఁదగు బుద్ధిన్.
ఘనరుచిగల మందస్మిత
మునకనుగుణ మగు ప్రసాదమును జిత్తమునన్
మునుకొని ధ్యానముసేయం
జనుయోగిజనాళి కెపుడు సౌజన్యనిధీ!
పూని నతశిరులైనట్టి భూజనముల
శోకబాష్పాంబుజలధి సంశోషకంబు
నత్యుదారతమము హరిహాస మెపుడుఁ
దలఁపఁగావలె నాత్మలోఁ దవిలి వినుము.
మునులకు మకరకేతనునకు మోహనం;
బైన స్వకీయ మాయావిలాస
మున రచితం బైన భ్రూమండలంబును;
ముని మనఃకుహర సమ్మోదమానుఁ
డగు నీశ్వరుని మందహాసంబు నవపల్ల;
వాధర కాంతిచే నరుణ మైన
మొల్లమొగ్గల కాంతి నుల్లసం బాడెడు;
దంతపంక్తిని మదిఁ దలఁపవలయు
వెలయ నీరీతి నన్నియు వేఱువేఱ
సంచితధ్యాన నిర్మల స్థానములుగ
మనములోఁ గను" మని చెప్పి మఱియుఁ బలికె
దేవహూతికిఁ గపిలుండు దేటపడఁగ.
ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత తృతీయ స్కంధములోని విష్ణు సర్వాంగ స్తోత్రము అను స్తుతి