స్తుతులు స్తోత్రాలు : నారదుని కృష్ణ స్తుతి (శ్రీ కరం)
నారదుని కృష్ణ స్తుతి (శ్రీ కరం)
“జగదీశ! యోగీశ! సర్వభూతాధార! ;
సకలసంపూర్ణ! యీశ్వర! మహాత్మ!
కాష్ఠగతజ్యోతి కైవడి నిఖిల భూ;
తము లందు నొకఁడవై తనరు దీవు
సద్గూఢుఁడవు; గుహాశయుఁడవు సాక్షివి;
నీ యంతవాఁడవై నీవు మాయఁ
గూడి కల్పింతువు గుణముల; వానిచేఁ;
బుట్టించి రక్షించి పొలియఁజేయుఁ
దీ ప్రపంచ మెల్ల నిట్టి నీ విప్పుడు
రాజమూర్తులైన రాక్షసులను
సంహరించి భూమిచక్రంబు రక్షింప
నవతరించినాఁడ వయ్య! కృష్ణ!
దేవా! నీచేత నింక చాణూర ముష్టిక గజ శంఖ కంస యవన ముర నరక పౌండ్రక శిశుపాల దంతవక్త్ర సాల్వ ప్రముఖులు మడిసెదరు; పారిజాతం బపహృతం బయ్యెడిని; నృగుండు శాపవిముక్తుం డగు; శ్యమంతకమణి సంగ్రహంబగు; మృత బ్రాహ్మణపుత్ర ప్రదానంబు సిద్ధించు; నర్జునసారథివై యనేకాక్షౌహిణీ బలంబుల వధియించెదవు; మఱియును.
కృష్ణా! నీ వొనరించు కార్యములు లెక్కింపన్ సమర్థుండె? వ
ర్ధిష్ణుండైన విధాత మూఁడుగుణముల్ దీపించు లోపించు రో
చిష్ణుత్వంబున నుండు నీవలన; నిస్సీమంబు నీ రూపు నిన్
విష్ణున్ జిష్ణు సహిష్ణు నీశు నమితున్ విశ్వేశ్వరున్ మ్రొక్కెదన్.
ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత దశమ - పూర్వ స్కంధములోని నారదుని కృష్ణ స్తుతి అను స్తుతి