స్తుతులు స్తోత్రాలు : కర్దముని భగవత స్తుతి (సర్వాభీష్ట ప్రదం)
కర్దముని భగవత స్తుతి (సర్వాభీష్ట ప్రదం)
"విను;మనఘ! కృతయుగంబున
మునినాథుం డయిన కర్దముఁడు ప్రజల సృజిం
పనువనజసంభవునిచే
తనియుక్తుం డగుచు మది ముదము సంధిల్లన్.
ధీరగుణుఁడు సరస్వతీతీర మందుఁ
దవిలి పదివేల దివ్యవత్సరము లోలిఁ
దపముసేయుచు నొకనాఁడు జపసమాధి
నుండి యేకాగ్రచిత్తుఁడై నిండు వేడ్క.
వరదుఁ బ్రసన్ను మనోరథ
వరదానసుశీలు నమరవంద్యు రమేశున్
దురితవిదూరు సుదర్శన
కరుఁబూజించిన నతండు కరుణాకరుఁడై.
అంతరిక్షంబునం బ్రత్యక్షం బైన.
తరణి సుధాకర కిరణ సమంచిత;
సరసీరుహోత్పల స్రగ్విలాసు
కంకణ నూపురగ్రైవేయ ముద్రికా;
హారకుండల కిరీటాభిరాము
కమనీయ సాగరకన్యకా కౌస్తుభ;
మణి భూషణోద్భాసమాన వక్షు
సలలిత దరహాస చంద్రికా ధవళిత;
చారు దర్పణ విరాజత్కపోలు
శంఖ చక్ర గదాపద్మ చారు హస్తు
నలికులాలక రుచిభాస్వదలికఫలకు
పీతకౌశేయవాసుఁ గృపాతరంగి
తస్మితేక్షణుఁ బంకజోదరుని హరిని.
మఱియు; శబ్దబ్రహ్మశరీరవంతుండును, సదాత్మకుండును, జ్ఞానైక వేద్యుండును, వైనతేయాంస విన్యస్త చరణారవిందుండును నయిన గోవిందుని గనుంగొని సంజాత హర్ష లహరీ పరవశుండును లబ్ధ మనోరథుండును నగుచు సాష్టాంగదండప్రణామంబు లాచరించి; తదనంతరంబ.
ముకుళిత కరకమలుండయి
యకుటిల సద్భక్తి పరవశాత్మకుఁ డగుచున్
వికచాంభోరుహలోచను
నకునిట్లనియెం దదాననముఁ గనుఁ గొనుచున్.
"అబ్జాక్ష! సకల భూతాంతరాత్ముఁడ వనఁ;
దనరుచుండెడి నీదు దర్శనంబుఁ
దలకొని సుకృతసత్ఫలభరితంబు లై;
నట్టి యనేక జన్మానుసరణ
ప్రకటయోగక్రియాభ్యాసనిరూఢు లై;
నట్టి యోగీశ్వరు లాత్మఁ గోరి
యెంతురు యోగీశ్వరేశ్వర యే భవ;
త్పాదారవింద సందర్శనంబు
గంటి భవవార్థిఁ గడవంగఁ గంటి మంటిఁ
గడఁగి నా లోచనంబుల కలిమి నేఁడు
తవిలి సఫలత నొందె; మాధవ! ముకుంద!
చిరదయాకర! నిత్యలక్ష్మీవిహార!
అదియునుం గాక; దేవా! భవదీయ మాయావిమోహితులై హత మేధస్కులై సంసారపారావారోత్తారకంబులైన భవదీయ పాదారవిందంబులు దుచ్ఛవృత్తి కాము లయి సేవించి నిరయగతులైన వారికిం దత్కాయ యోగ్యంబు లగు మనోరథంబుల నిత్తువు; అట్టి సకాము లైన వారిఁ నిందించు నేనును గృహమేధ ధేనువు నశేషమూలయుం, ద్రివర్గ కారణయుం, సమానశీలయు నయిన భార్యం బరిణయంబుగా నపేక్షించి కల్పతరుమూల సదృశంబు లైన భవదీయ పాదారవిందంబులు సేవించితి; అయిన నొక్క విశేషంబు గలదు; విన్నవించెద నవధరింపుము; బ్రహ్మాత్మకుండ వయిన నీదు వచస్తంతు నిబద్దు లై లోకులు కామహతు లైరఁట; ఏనును వారల ననుసరించినవాఁడ నై కాలాత్మకుండ వైన నీకు నభిమతం బగునట్లుగాఁ గర్మమయం బైన భవదాజ్ఞాచక్రంబు ననుసరించుటకుఁ గాని మదీయ కామంబు కొఱకుఁ గాదు; భవదీయ మాయావినిర్మితంబును; గాలాత్మక భూరి వేగసమాయుక్తంబును; నధిమానస సమేత త్రయోదశ మాసారంబును; షష్ట్యుత్తరశతత్ర యాహోరాత్ర మయ పర్వంబును; ఋతుషట్క సమాకలిత నేమియుం; జాతుర్మాస్యత్రయ విరాజిత నాభియు; నపరిమిత క్షణలవాది పరికల్పిత పత్రశోభితంబునుం; గాలాత్మక భూరివేగ సమాయుక్తంబును నైన కాలచక్రంబు సకల జీవనికరాయుర్గ్రసన తత్పరం బగుం; గాని కామాభిభూత జనానుగత పశుప్రాయు లగు లోకుల విడిచి భవ పరితాప నివారణ కారణం బయిన భవదీయ చరణాతపత్ర చ్ఛాయాసమాశ్రయులై తావకీన గుణకథన సుధాస్వాదన రుచిర లహరీ నిరసిత సకల దేహధర్ము లైన భగవద్భక్త జనాయుర్హరణ సమర్థంబు గాకుండు" నని వెండియు.
"అనఘా! యొక్కఁడ వయ్యు నాత్మకృత మాయాజాత సత్త్వాది శ
క్తినికాయస్థితి నీ జగజ్జనన వృద్ధిక్షోభ హేతుప్రభా
వనిరూఢిం దగు దూర్ణనాభిగతి విశ్వస్తుత్య! సర్వేశ! నీ
ఘనలీలా మహిమార్ణవంబుఁ గడవంగావచ్చునే? యేరికిన్.
దేవ! శబ్దాది విషయ సుఖకరం బగు రూపంబు విస్తరింపఁ జేయు టెల్ల నస్మదనుగ్రహార్థంబు గాని నీ కొఱకుం గా దాత్మీయమాయా పరివర్తిత లోకతంత్రంబు గలిగి మదీయ మనోరథ సుధాప్రవర్షి వైన నీకు నమస్కరించెద."
అనియిబ్భంగి నుతించినన్ విని సరోజాక్షుండు మోదంబునన్
వినతానందన కంధరోపరిచరద్విభ్రాజమానాంగుఁడున్
యనురాగస్మితచంద్రికాకలితశోభాలోకుఁడై యమ్మునీం
ద్రునిఁగారుణ్యమెలర్పఁజూచి పలికెన్ రోచిష్ణుఁడై వ్రేల్మిడిన్
"మునివర! యే కోరిక నీ
మనమునఁ గామించి నను సమంచిత భక్తిన్
నెనరునఁ బూజించితి నీ
కనయము నా కోర్కి సఫల మయ్యెడుఁ జుమ్మీ."
అని యానతిచ్చి;ప్రజాపతిపుత్రుండును సమ్రాట్టును నైన స్వాయంభువమనువు బ్రహ్మావర్తదేశంబు నందు సప్తార్ణవమేఖలా మండిత మహీమండలంబుఁ బరిపాలించుచున్నవాఁడు; అమ్మహాత్ముం డపరదివసంబున నిందులకు శతరూప యను భార్యాసమేతుండై భర్తృ కామ యగు కూఁతుం దోడ్కొని భవదీయ సన్నిధికిం జనుదెంచి; నీకు ననురూప వయశ్శీల సంకల్ప గుణాకర యైన తన పుత్రిం బరిణయంబు గావించు; భవదీయ మనోరథంబు సిద్ధించు; ననుం జిత్తంబున సంస్మరించు చుండు; నమ్మనుకన్య నిను వరించి భవద్వీర్యంబు వలన నతి సౌందర్యవతు లయిన కన్యలం దొమ్మండ్రం గను; ఆ కన్యకానవకంబు నందు మునీంద్రులు పుత్రోద్పాదనంబులు సేయంగలరు; నీవు మదీయ శాసనంబును ధరియించి మదర్పితాశేషకర్ముండ వగుచు; నైకాంతిక స్వాంతంబున భూతాభయదానదయాచరిత జ్ఞానివై నా యందు జగంబులు గలవనియు; నీ యందు నేఁ గల ననియు; నెఱింగి సేవింపుము. చరమకాలంబున ననుం బొందగలవు. భవదీయ వీర్యంబువలన నేను నీ భార్యాగర్భంబుఁ బ్రవేశించి మత్కళాంశంబునఁ బుత్రుండనై సంభవించి నీకుం దత్త్వసంహిత నుపన్యసింతును;" అని జనార్దనుండు గర్దమున కెఱింగించి; యతండు గనుగొనుచుండ నంతర్హితుండై.
ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత తృతీయ స్కంధములోని కర్దముని భగవత స్తుతి అను స్తుతి