స్తుతులు స్తోత్రాలు : దిక్పాలకాదుల దేవదేవు స్తుతి (కార్యసిద్ధి ప్రదం)
దిక్పాలకాదుల దేవదేవు స్తుతి (కార్యసిద్ధి ప్రదం)
పంచమహాభూత పరినిర్మితంబైన;
ముజ్జగంబుల కెల్ల నొజ్జ యైన
బ్రహ్మయు నేమును బరఁగ నందఱుఁ గూడి;
యెవ్వనికై పూజలిత్తు మెపుడు
నట్టి సర్వేశ్వరుం డాగమ వినుతుండు;
సర్వాత్మకుఁడు మాకు శరణ మగును
అతిపూర్ణకాము నహంకారదూరుని;
సముని శాంతునిఁ గృపాస్పదుని గురుని
మాని యన్యుని సేవింపఁ బూనునట్టి
కపటశీలుని నతి పాపకర్మబుద్ధి
శునక వాలంబు పట్టుక ఘనతరాబ్ధి
దరియఁ జూచుట గాదె? తాఁ దామసమున.
ఉదకమయంబునన్ వసుధ నోడగఁ జేసి తనర్చు కొమ్మునన్
వదలక యంటఁగట్టి మనువల్లభుఁ గాచిన మత్స్యమూర్తి స
మ్మదమున మమ్ము బ్రోచు ననుమానము మానఁగ వృత్రుచేతి యా
పద దొలగించి నేఁడు సురపాలుర పాలిటి భాగ్య దైవమై.
రంతు చేయుచు వాతధూత కరాళ భంగుర భంగ దు
ర్దాంత సంతత సాగరోదక తల్ప మొంది వసించు బ
హ్మంతవానిని బొడ్డుఁదమ్మిని నాఁచి కాచిన నేర్పరిం
తంతవాఁ డనరాని యొంటరి యాదరించు మముం గృపన్.
దేవతలమైన మే మిట్టి దేవదేవు
సర్వలోక శరణ్యుని శరణు చొచ్చి
బలితమైనట్టి వీని యాపదలఁ బాసి
మీఱి శుభములఁ జేకొనువార మిపుడు.
ఇట్లు స్తుతియించుచున్న దేవతలకు భక్తవత్సలుండైన వైకుంఠుండు ప్రసన్నుం డయ్యె నప్పుడు.
ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత షష్ఠ స్కంధములోని దిక్పాలకాదుల దేవదేవు స్తుతి అను స్తుతి