స్తుతులు స్తోత్రాలు : భ్రమర గీతాలు (దైవానుగ్రహములు)
భ్రమర గీతాలు (దైవానుగ్రహములు)
అని యిటు గోపికల్ పలుక నం దొక గోపిక కృష్ణపాదచిం
తనమునఁ జొక్కి చేరువను దైవవశంబునఁ గాంచె నుజ్జ్వల
త్సునిశిత సద్వివేకముఁ బ్రసూనమరంద మదాతిరేకమున్
ఘనమృదునాద సంచలిత కాముక లోకముఁ జంచరీకమున్.
కని హరి దన్నుం బ్రార్థింపఁ బుత్తెంచిన దూత యని కల్పించుకొని యుద్ధవునికి నన్యాపదేశంబై యెఱుకపడ నయ్యళికిం దొయ్య లిట్లనియె.
"భ్రమరా! దుర్జనమిత్ర! ముట్టకుము మా పాదాబ్జముల్ నాగర
ప్రమదాళీకుచకుంకుమాంకిత లసత్ప్రాణేశదామప్రసూ
న మరందారుణితాననుండ వగుటన్ నాథుండు మన్నించుఁగా
క మమున్నేఁపుచుఁ బౌరకాంతల శుభాగారంబులన్ నిత్యమున్.
ఒక పువ్వందలి తేనెఁ ద్రావి మధుపా! యుత్సాహివై నీవు వే
ఱొకటిం బొందెడి భంగి మ మ్మధరపియ్యూషంబునం దేల్చి మా
యకలం కోజ్జ్వల యౌవనంబు గొని యన్యాసక్తుఁ డయ్యెన్ విభుం
డకటా! యాతని కెట్లు దక్కె సిరి? మిధ్యాకీర్తి యయ్యెంజుమీ.
భృంగా! కృష్ణుఁడు మంచివాఁ డనుచు సంప్రీతిం బ్రశంసించె; దీ
సంగీతంబున నేము చొక్కుదుమె? తచ్చారిత్రముల్ వింతలే?
యంగీకారము గావు మాకుఁ; బురకాంతాగ్రప్రదేశంబులన్
సంగీతం బొనరింపు వారిడుదు రోజ న్నీకు నిష్ఠార్థముల్.
సమదాళీశ్వర! చూడు ముజ్జ్వలిత హాసభ్రూవిజృంభంబులన్
రమణీయుండగు శౌరిచేఁ గరఁగరే రామల్ త్రిలోకంబులం?
బ్రమదారత్నము లక్ష్మి యాతని పదాబ్జాతంబు సేవించు ని
క్కము నే మెవ్వర మా కృపాజలధికిం గారుణ్యముం జేయఁగన్?
రోలంబేశ్వర! నీకు దౌత్యము మహారూఢంబు; నీ నేరుపుల్
చాలున్; మచ్చరణాబ్జముల్ విడువు మస్మన్నాథపుత్రాదులన్
లీలం బాసి పరంబు డించి తనకున్ లీనత్వముం బొందు మ
మ్మేలా పాసె విభుండు? ధార్మికులు మున్నీ చందముల్ మెత్తురే.
వాలిం జంపెను వేటగాని పగిదిన్ వంచించి; దైత్యానుజన్
లోలం బట్టి విరూపిఁ జేసెను; బలిన్ లోభంబుతోఁగట్టి యీ
త్రైలోక్యంబు మొఱంగి పుచ్చుకొనియెన్; ధర్మజ్ఞుఁడే మాధవుం?
డేలా షట్పద! యెగ్గు మా వలన నీ కెగ్గింపఁగా నేటికిన్.
పన్నుగ మింటిపై కెగసి పాఱు విహంగములైన వీనులం
ద న్నొక మాటు విన్న గృహ దార సుతాదులఁ బాసి విత్తసం
పన్నత డించి సంసరణపద్ధతిఁ బాపెడువాఁడు నిత్యకాం
క్ష న్నెఱి నున్న మా బ్రతుకు సైఁచునె యేల మధువ్రతోత్తమా!
కమనీయంబగు వేఁటకానిపలు కాకర్ణించి నిక్కంబుగాఁ
దమ చిత్తంబులఁ జేర్చి చేరి హరిణుల్ దద్బాణ నిర్భిన్నలై
యమితోగ్రవ్యధ నొందుభంగి హరిమాయాలాపముల్ నమ్మి దుః
ఖములం జెందితి మంగజాస్త్ర జనితోగ్రశ్రాంతి నిందిందిరా!
బంధుల బిడ్డలన్ మగల భ్రాతలఁ దల్లులఁ దండ్రులన్ మనో
జాంధతఁ జేసి డించి తను నమ్మిన మమ్ము వియోగదుర్దశా
సింధువులోనఁ ద్రోచి యిటు చేరక పోవుట పాడిగాదు; పు
ష్పంధయ! మీ యధీశునకుఁ బాదములంబడి యొత్తి చెప్పవే.
కాంచనరత్నసంఘటిత సౌధంబులే;
మా కుటీరంబులు మాధవునకు?
వివిధ నరేంద్రసేవిత రాజధానియే;
మా పల్లె యదువంశమండనునకు?
సురభిపాదప లతాశోభితారామమే;
మా యరణ్యము సింహమధ్యమునకుఁ?
గమనీయ లక్షణ గజ తురంగంబులే;
మా ధేనువులు కంసమర్దనునకు?
రూప విభ్రమ నైపుణ్య రూఢలైన
మగువలమె మేము మన్మథమన్మథునకు?
నేల చింతించు మముఁ? గృష్ణుఁ డేల తలఁచుఁ?
బృథివి నథిపులు నూతన ప్రియులు గారె. ?
ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత దశమ - పూర్వ స్కంధములోని భ్రమర గీతాలు అను స్తుతి