పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

శ్రీ కుచేలోపాఖ్యానము : పూర్ణి

82

ధిమదవిరామా! ర్వలోకాభిరామా!
సురిపువిషభీమా! సుందరీలోకకామా!
ణివరలలామా! తాపసస్తోత్రసీమా!
సురుచిరగుణధామా! సూర్యవంశాబ్ధిసోమా!
 టీక:- శరధిమదవిరామా = శ్రీరామా {శరధి మద విరాముడు - శరధి (సముద్రము యొక్క) మద (గర్వమును) విరాముడు (అణచినవాడు), శ్రీరాముడు}; సర్వలోకాభిరామా = శ్రీరామా {సర్వ లోకాభిరాముడు - ఎల్ల లోకములకు అభిరాముడు (మనోజ్ఞుడు), శ్రీరాముడు}; సురరిపువిషభీమా = శ్రీరామా {సురరిపు విష భీముడు - సురరిపు (రాక్షసులు అను) విషమునకు భీముడు (శివుడు), శ్రీరాముడు}; సుందరీలోకకామా = శ్రీరామా {సుందరీ లోక కాముడు - సుందర స్త్రీసమూహములకు మన్మథుడు, శ్రీరాముడు}; ధరణివరలలామా = శ్రీరామా {ధరణివర లలాముడు - ధరణివర (రాజులలో) లలాముడు (శ్రేష్ఠుడు), శ్రీరాముడు}; తాపస స్తోత్ర సీమా = శ్రీరామా {తాపసస్తోత్రసీముడు - ఋషుల స్తోత్రములుకు మేర (లక్ష్యము) ఐనవాడు, శ్రీరాముడు}; సురుచిరగుణధామా = శ్రీరామా {సు రుచిర గుణ ధాముడు - సు (మిక్కిలి) రుచిర (మనోజ్ఞమైన) గుణ (సుగుణములకు) ధాముడు (ఉనికిపట్టైన వాడు), శ్రీరాముడు}; సూర్యవంశాబ్ధిసోమా = శ్రీరామా {సూర్య వంశాబ్ధి సోముడు - సూర్యవంశము అను అబ్ధి (సముద్రమునకు) సోముడు (చంద్రుడు), శ్రీరాముడు}.
 భావము:- శ్రీరామచంద్ర! సముద్రుని గర్వాన్ని అణచినవాడ! సర్వలోకాలకూ సుందరుడా! రాక్షసులకు పరమ భయంకరుడా! సుందరీ జనులకు మన్మథుడా! రాజ శ్రేష్ఠుడా! మునీంద్రులచేత స్తుతింపబడేవాడా! సుగుణాలకు అలవాలమైన వాడా! సూర్యవంశమనే సముద్రానికి చంద్రుడా! శ్రీరామచంద్ర!

83

ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బైన శ్రీమహాభాగవతం బను మహాపురాణంబు నందు దశమస్కంధంబు యుత్తరభాగము నందలి, కుచేలుని నాదరించుట, గురుప్రశంస చేయుట, యటుకు లారగించుట యను ఘట్టములు గల కుచేలోపాఖ్యానంబు.
 టీక:- ఇది = ఇది; శ్రీ = శ్రీమంతమైన; పరమేశ్వర = భగవంతుని; కరుణా = దయ; కలిత = కలిగినట్టి వాడు; కవితా = కవిత్వమును; విచిత్ర = వివరముగా చిత్రించువాడు; కేసనమంత్రి = కేసనమంత్రికి; పుత్ర = కొడుకు; సహజ = సహజసిద్ధముగా; పాండిత్య = పాండిత్య మబ్బినవాడు; పోతనామాత్య = పోతనామాత్యుడు చేత; ప్రణీతంబు = సంస్కరింపబడినది; ఐన = అయిన; శ్రీమత్ = శ్రీమంతమైన; మహా = గొప్ప; భాగవతంబు = భాగవతము; అను = అనెడి; మహా = గొప్ప; పురాణంబున్ = పురాణము; అందున్ = అందు; దశమ = పదవ; స్కంధంబు = స్కంధము; ఉత్తర భాగము = తరువాతి (రెండవ) భాగము; అందలి = లోని; కుచేలుని = కుచేలుడిని (శ్రీకృష్ణ బాల్య స్నేహితుడు); ఆదరించుట = మన్నించుట; గురు = గురువు యొక్క; ప్రశంసచేయుట = విశిష్ఠతను పొగడుట; అటుకులు = వడ్లు నానబోసి వేయించి దంచిన భక్ష్యవిశేషమును; ఆరగించుట = తినుట; అను = అనెడి; ఘట్టములు = శీర్షికలు; కల = కలిగిన; కుచేల = కుచేలుని గురించిన; ఉపాఖ్యానంబు = కథ లోని కథ.
 భావము:- ఇది పరమేశ్వరుని దయ వలన కలిగిన కవితావైభవం కలవాడు, కేసన మంత్రి పుత్రుడు అయిన పోతనామాత్యునిచే రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలోని దశమ స్కంధము ఉత్తరభాగము నందలి శ్రీకృష్ణుడు తన బాల్య స్నేహితుడు కుచేలుని ఆదరించుట; గురువు విశిష్ఠతను పొగడుట; కుచేలుని వద్దనుండి అటుకులు తినుట అను ఘట్టములు కలిగిన కుచేలోపాఖ్యానము సమాప్తము.

ఓం ఓం ఓం
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వేజనాః సుఖినో భవంతు.