పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పోతన రామాయణము : పోతన రామాయణము మిగతా భావము


9-319-సీ.
వ గూడి యిరుదెసఁ పిరాజు రాక్షస;
రాజు నొక్కటఁ జామములు వీవ
నుమంతుఁ డతిధవళాతపత్రముఁ బట్ట;
బాదుకల్ భరతుండు క్తిఁ దేర
త్రుఘ్ను డమ్ములుఁ జాపంబుఁ గొనిరాఁగ;
సౌమిత్రి భృత్యుఁడై నువుచూప
లపాత్రచేఁబట్టి నకజ గూడిరాఁ;
గాంచనఖడ్గ మందుఁడు మోవఁ
భావము:-

9-319.1-ఆ.
సిఁడి కేడె మర్థి ల్లూకపతి మోచి
కొలువఁ బుష్పకంబు వెయ నెక్కి
గ్రహము లెల్లఁ గొలువఁ డు నొప్పు సంపూర్ణ
చంద్రుపగిది రామచంద్రుఁ డొప్పె.
భావము:-  జంటగా రెండు పక్కలా చేరి సుగ్రీవ విభీషణులు కూడి చామరాలు వీస్తున్నారు. హనుమంతుడు వెల్లగొడుగు పట్టుతున్నాడు. కాలిజోళ్ళు భరతుడు భక్తితో తీసుకు వస్తున్నాడు శత్రుఘ్నుడు విల్లంబులు తీసుకువస్తున్నాడు. లక్ష్మణుడు చనువుగా సేవచేస్తున్నాడు. కలశం పట్టుకుని జానకీదేవి కూడా వస్తోంది. బంగారపు కత్తిని అంగదుడు మోసుకొస్తున్నాడు. బంగారపు డాలును జాంబవంతుడు మోసుకొస్తున్నాడు. ఆ విధంగ దివ్యవైభవాలతో పుష్పకవిమానం అధిరోహించి గ్రహాలు సేవించే నిండు చంద్రుడిలా శ్రీరాముడు చక్కగా ఉన్నాడు.

9-320-వ.
ఇట్లు పుష్పకారూఢుండై, కపి బలంబులు చేరికొలువ. శ్రీరాముం డయోధ్యకుం జనియె; నంతకు మున్న యప్పురంబునందు.
భావము:-  ఈ విధంగ పుష్పకవిమానం ఎక్కి వానర సేనలు సేవిస్తుండగా శ్రీరాముడు అయోధ్యాకు వెళ్ళాడు. దానికి ముందే ఆ నగరంలో.

9-321-సీ.
వీథులు చక్కఁ గావించి తోయంబులు;
ల్లి రంభా స్తంభయము నిలిపి
ట్టుజీరలు చుట్టి హుతోరణంబులుఁ;
లువడంబులు మేలుట్లుఁ గట్టి
వేదిక లలికించి వివిధరత్నంబుల;
మ్రుగ్గులు పలుచందములుగఁ బెట్టి
లయ గోడల రామథలెల్ల వ్రాయించి;
ప్రాసాదముల దేవవనములను
భావము:-

9-321.1-తే.
గోపురంబుల బంగారు కుండ లెత్తి
యెల్ల వాకిండ్ల గానిక లేర్పరించి
నులు గైచేసి తూర్యఘోములతోడ
నెదురు నడతెంచి రా రాఘవేంద్రుకడకు.
భావము:-  వీధులు అన్నీ చక్కగా తుడిచి కళ్ళాపిజల్లారు. అరటి స్తంభములు నిలబెట్టి పట్టుబట్టలు కట్టారు. తోరణాలు, కలువపూల దండలు, చాందినీలు కట్టారు. అరుగులు అలికించి రత్నాల ముగ్గులు వేసారు. గోడలపై రామకథలు వ్రాయించారు. భవనాల దేవాలయాల, గోపురాల మీద బంగారు కలశాలు పెట్టారు, వాకిళ్ళలో కానుకలు అమర్చారు. ఇలా సర్వాంగ సుందరంగా పట్టణాన్ని అలంకరించి, ప్రజలు నమస్కరించి, మంగళ వాయిద్యాలతో శ్రీరాముడికి ఎదుర్కోలు చేసారు.

9-322-క.
ద గజదానధారల
దుదుమలై యున్న పెద్ద త్రోవలతోడన్
ణీయ మయ్యె నప్పురి
ణుఁడు వచ్చినఁ గరంగు మణియపోలెన్.
భావము:-  అప్పుడు ఆ పట్టణం మదించిన ఏనుగుల మదజల ధారలతో తడసిన రాజమార్గాలతో మనోహరంగా, భర్త రాకకై ఎదురు చూస్తున్న భార్యలా ఉంది.

9-323-ఆ.
రామచంద్రవిభుని రాకఁ దూర్యములతో
థ గజాశ్వ సుభటరాజితోడ
మరెఁ బురము చంద్రుఁ రుదేర ఘూర్ణిల్లు
జంతుభంగమిలిత లధిభంగి.
భావము:-  చంద్రుని రాకతో సాగరం ఉప్పొంగినట్లు, రామచంద్రుని రాకతో అయోధ్యా నగరం మంగళవాద్యములుతో; రథాలు, ఏనుగులు, గుఱ్ఱాలు, సైనికులుతో విలసిల్లింది.

9-324-వ.
ఇట్లొప్పుచున్న యప్పురంబు ప్రవేశించి, రాజమార్గంబున రామచంద్రు డరుగుచున్న సమయంబున.
భావము:-  ఇలా ముస్తాబయిన ఆ పట్టణం ప్రవేశించి రాజమార్గంలో శ్రీరాముడు వేంచేస్తున్న సమయంలో.

9-325-మ.
తఁడే రామనరేంద్రుఁ డీ యబలకా యింద్రారి ఖండించె న
ల్లతఁడే లక్ష్మణుఁ డాతఁడే కపివరుం డా పొంతవాఁడే మరు
త్సుతుఁ డా చెంగట నా విభీషణుఁ డటంచుం చేతులం జూపుచున్
తులెల్లం బరికించి చూచిరి పురీసౌధాగ్రభాగంబులన్.
భావము:-  నగరకాంతలు అందరూ భవనాలపైకెక్కి చూస్తూ, “ఇతనే రాజు రాముడు. ఇదిగో సీతా దేవి, రాముడు ఈమెకోసమే రావణుణ్ణి సంహరించాడు. అడిగో లక్ష్మణుడు, సుగ్రీవుడు అడిగో, ఆ పక్కవాడే ఆంజనేయుడు, ఆ పక్కన ఆ విభీషణుడు అని అంటూ చేతులు చాపి చూపి మరీ పరిశీలనగా చూడసాగారు.

9-326-వ.
ఇట్లు సమస్తజనంబులు చూచుచుండ రామచంద్రుండు రాజమార్గంబునం జనిచని.
భావము:-  ఈ విధంగా ప్రజలు అందరూ చూస్తుండగా శ్రీరాముడు రాజమార్గంలో వెళ్లి...

9-327-సీ.
టికంపు గోడలు వడంపు వాకిండ్లు;
నీలంపుటరుగులు నెఱయఁ గలిగి
మనీయ వైడూర్య స్తంభచయంబుల;
కరతోరణముల హిత మగుచు
డగల మాణిక్యద్ధ చేలంబులఁ;
జిగురుఁ దోరణములఁ జెలువు మీఱి
పుష్పదామకముల భూరివాసనలను;
హుతరధూపదీముల మెఱసి
భావము:-

9-327.1-తే.
మాఱువేల్పులభంగిని లయుచున్న
తులుఁ బురుషులు నెప్పుడు సందడింప
గుఱుతు లిడరాని ధనముల కుప్ప లున్న
రాజసదనంబునకు వచ్చె రామవిభుఁడు.
భావము:-  స్పటికాల గోడలు, పగడాల వాకిళ్ళు, ఇంద్రనీలాల వేదికలు నిండుగ ఉన్నాయి. వైడూర్యాలు పొదిగిన స్తంభాలు, మకర తోరణాలతో, ధ్వజాలతో, మాణిక్యాలు పొదిగిన వస్త్రాలతో, చిగురటాకుల తోరణాలతో, పూలదండలసువాసనలతో, ధూప దీపాలతో, దేవతలలా తిరిగుతున్న స్త్రీపురుషులతో, అనంత ధనరాసులతో మనోజ్ఞంగా ప్రకాశిస్తున్న రాజప్రసాదానికి శ్రీరామచంద్రప్రభువు వచ్చాడు.

9-328-వ.
ఇట్లు వచ్చి.
భావము:-  ఇలా అంతపురం చేరి....

9-329-ఉ.
ల్లులకెల్ల మ్రొక్కి తమ ల్లికి వందన మాచరించి య
ల్లల్ల బుధాళికిన్ వినతుఁడై చెలికాండ్రను దమ్ములం బ్రసం
పుల్లతఁ గౌగలించుకొని భూవరుఁ డోలిఁ గృపారసంబు రం
జిల్లఁగఁ జాల మన్ననలు చేసె నమాత్యులఁ బూర్వభృత్యులన్.
భావము:-  శ్రీరాముడు తల్లులు అందరికి నమస్కరించి తమ కన్నతల్లికి నమస్కారం చేసాడు. పండితుల ఎడ వినయం చూపించాడు. స్నేహితులకు తమ్ముళ్ళకు ఆలింగనాలు చేసాడు. మంత్రులను, సేవకులకు మిక్కిల ఆదరం చూపించాడు.

9-330-వ.
తత్సమయంబునఁ దల్లులు
భావము:-  ఆ సమయంలో తల్లులు....

9-331-చ.
కొడుకులుఁ బెద్దకోడలును గొబ్బున మ్రొక్కిన నెత్తి చేతులం
బుడుకుచు మోములుందలలుబోరన ముద్దులుగొంచునవ్వుచుం
దొలకు వారి రాఁదిగిచి తోఁగఁగఁ జేసిరి నేత్రధారలన్
వెలిన ప్రాణముల్ దగఁ బ్రవిష్టములయ్యె నటంచు నుబ్బుచున్.
భావము:-  కొడుకులూ, పెద్దకోడలు మ్రొక్కగా, వారిని పైకి లేవదీసి చేతులతో నిమురుతు, ముఖాలు, తలలు ముద్దులు పెడుతూ, నవ్వుతూ ఒళ్ళోకి చేరదీసి సంతోషాశ్రువలతో వారిని తడిపేసారు. పోయిన ప్రాణాలు లేచి వచ్చాయి అంటూ పొంగిపోయారు.

9-332-వ.
అంత వసిష్ఠుం డరుగుదెంచి. శ్రీరామచంద్రుని జటాబంధంబు విడిపించి, కులవృద్దులుం దానును సమంత్రకంబుగ దేవేంద్రుని మంగళస్నానంబు చేయించు బృహస్పతి చందంబున, సముద్రనదీజలంబుల నభిషేకంబు చేయించె; రఘువరుండును, సీతాసమేతుండై, జలకంబులాడి, మంచి పుట్టంబులు గట్టికొని, కమ్మని పువ్వులు దుఱిమి, సుగంధంబు లలందికొని, తొడవులు దొడిగికొని, తనకు భరతుఁడు సమర్పించిన రాజసింహాసనంబునం గూర్చుండి, యతని మన్నించి కౌసల్యకుఁ బ్రియంబు చేయుచు, జగత్పూజ్యంబుగ రాజ్యంబు జేయుచుండెను; అప్పుడు.
భావము:-  అంతట, ఇంద్రుడికి మంగళస్నానాలు చేయించె బృహస్పతి వలె, వసిష్ఠులవారు వచ్చి కులపెద్దలు తాను శ్రీరామచంద్రునికి జటలు కట్టిన జుట్టు చిక్కు తీసి, మంత్రయుక్తంగా పవిత్రమైన సముద్రపు నీటితో, నదుల నీటితో స్నానాలు చేయించారు. శ్రీరాముడు సీతాదేవి స్నానాలు చేసి, చక్కటి బట్టలను ధరించి, సువాసనలుగల పూలు ముడిచికొని, సుగంధాలను రాసుకొని, ఆభరణాలు అలంకరించుకొని, తనకు భరతుడు అప్పగించిన పట్టపు సింహాసనపై కూర్చున్నారు. భరతుని ఆదరిస్తూ కౌసల్యాదేవి సంతోషించేలా, లోకం పూజించేలా రాజ్యం ఏలుతూ ఉన్నాడు. ఆ సమయంలో....

9-333-సీ.
లఁగు టెల్లను మానెఁ లధు లేడింటికి;
లనంబు మానె భూక్రమునకు;
జాగరూకత మానె లజలోచనునకు;
దీనభావము మానె దిక్పతులకు;
మాసి యుండుట మానె మార్తాండవిధులకుఁ;
గావిరి మానె దిగ్గగనములకు;
నుడిగిపోవుట మానె నుర్వీరుహంబుల;
డఁగుట మానె ద్రేతాగ్నులకును;
భావము:-

9-333.1-ఆ.
డిఁది వ్రేఁగు మానెఁ రి గిరి కిటి నాగ
మఠములకుఁ బ్రజల లఁక మానె;
రామచంద్రవిభుఁడు రాజేంద్రరత్నంబు
రణిభరణరేఖఁ దాల్చు నపుడు.
భావము:-  ఆ రామరాజ్యంలో సంక్షోభాలు లేవు. సప్త సముద్రాలు కంపించడం లేదు. భూమండలం నిర్భయంగా ఉంది. పాపులు లేకపోడంతో విష్ణుమూర్తి జాగరూకత అవసరం లేకపోయింది. దిక్పాలకులకు దైనం లేదు. సూర్య చంద్రులకు వెలవెల పోవటం లేదు. దిక్కులు ఆకాశాలకు కావిరంగు పట్టటంలేదు. చెట్ల ఎడిపోవుటం లేదు. త్రేతాగ్నులు అణగిపోవుటం లేదు. భూభారం తగ్గడంతో దిగ్గజాలకు, కులపర్వతాలకు, వరాహమూర్తికి, ఆదిశేషుడికి, కూర్మమూర్తికి భారం తగ్గిపోయింది. లోకులకు కలతలు లేవు. అలా శ్రీరాముడు రాజ్యం ఏలాడు. అప్పుడు...

9-334-వ.
మఱియును.
భావము:-  ఇంకను.

9-335-సీ.
పొలఁతుల వాలుచూపుల యంద చాంచల్య;
బలల నడుముల యంద లేమి;
కాంతాలకములంద కౌటిల్యసంచార;
తివల నడపుల యంద జడిమ;
ముగుదల పరిరంభముల యంద పీడన;
మంగనాకుచముల యంద పోరు;
డఁతుల రతులంద బంధసద్భావంబు;
తులఁబాయుటలంద సంజ్వరంబు;
భావము:-

9-335.1-తే.
ప్రియులు ప్రియురాండ్ర మనముల బెరసి తార్పు
లంద చౌర్యంబు; వల్లభు లాత్మ సతుల
నాఁగి క్రొమ్ముళ్ళు పట్టుటం క్రమంబు;
రామచంద్రుఁడు పాలించు రాజ్యమందు.
భావము:-  శ్రీరాముని పాలనలో ఉన్న రాజ్యం రామరాజ్యం. ఆ రామరాజ్యం అంతా ఎంత ధర్మ బద్ధంగా సాగింది అంటే; స్త్రీల వాలుచూపులలో మాత్రమే చాంచల్యం కనిపించేది; వనితల నడుములలో మాత్రమే పేదరికం ఉండేది; నెలతల తలవెంట్రుకలలో మాత్రమే కౌటిల్యం ఉండేది; తరుణుల నడకలలో మాత్రమే మాంద్యం ఉండేది; నెలతల కౌగలింతలలో మాత్రమే పీడన ఉండేది; కామినుల స్తనాల్లో మాత్రమే ఘర్షణ ఉండేది; సతులతో కలయికల్లో మాత్రమే బంధాలు ఉండేవి; కాంతల ఎడబాటులలో మాత్రమే సంతాపం ఉండేది; ఎవరి ప్రియురాండ్ర మనసు వారు తెలిసి దొంగిలించుటలో మాత్రమే దొంగతనాలు ఉండేవి; ప్రియభార్యలను భర్తలు అడ్డగించి జడలుపట్టుకొని లాగటంలో మాత్రమే అక్రమాలు ఉండేవి;

9-336-క.
తండ్రి క్రియ రామచంద్రుఁడు
తండ్రుల మఱపించి ప్రజలఁ దా రక్షింపన్
తండ్రుల నందఱు మఱచిరి
తండ్రిగదా రామచంద్రరణిపుఁ డనుచున్.
భావము:-  శ్రీరాముడు కన్నతండ్రిలా పరిపాలిస్తుండటంతో. ప్రజలు అందరూ మా తండ్రి శ్రీరాముడే అని అనుకుంటున్నారు. కనుక రామ పాలనలోని ప్రజలు అందరు తమ కన్నతండ్రులను సైతం మరచిపోయారు.

9-337-వ.
మఱియు, నా రామచంద్రుండు రాజర్షిచరితుండును, నిజధర్మనిరతుండును, నేకపత్నీవ్రతుండును, సర్వలోకసమ్మతుండును నగుచు ధర్మవిరోధంబు గాకుండఁ గోరిక లనుభవించుచుఁ ద్రేతాయుగంబైన గృతయుగధర్మంబుఁ గావించుచు, బాలమరణంబు మొదలగు నరిష్టంబులు ప్రజలకుఁ గలుగకుండ రాజ్యంబుచేయుచుండె; నయ్యెడ
భావము:-  ఇంకను, ఆ శ్రీరాముడు రాజఋషివంటివాడు స్వధర్మంలో నిష్ఠ కలవాడు. ఏకపత్నీవ్రతుడు. లోకులందరికీ ఆమోదయోగ్యుడు. దర్మమువ్యతిరేకం కాని విధంగానే కోరికలను తీర్చుకొంటూ త్రేతాయుగం అయినా కృతయుగ ధర్మాలను నడపిస్తూ ఏలుతున్నాడు. చిన్నపిల్లలు చనిపోవడం లాంటి లోకులకు కీడులు కలగనివ్వకుండ రాజ్యం ఏలుతున్నాడు. అప్పుడు.

9-338-ఆ.
సిగ్గుపడుట గల్గి సింగారమును గల్గి
క్తిగల్గి చాల యముఁ గలిగి
యముఁ బ్రియముఁ గల్గి రనాథు చిత్తంబు
సీత దనకు వశము చేసికొనియె.
భావము:-  సీతాదేవి సిగ్గుపడుట, శృంగారాలంకారం, శ్రద్ద, భయభక్తులు నయము, ప్రీతి కలిగి మెలగుతూ రాజు శ్రీరాముని మనసును తనకు వశం చేసుకుంది.”

9-339-వ.
అనిన విని పరీక్షిన్నరేంద్రుం డిట్లనియె.
భావము:-  అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు.

9-340-ఆ.
"భ్రాతృజనుల యందు బంధువులందును
ప్రజల యందు రాజభావ మొంది
యెట్లు మెలఁగె? రాఘవేశ్వరుం డెవ్వనిఁ
గూర్చి క్రతువు లెట్లు గోరి చేసె?"
భావము:-  “శ్రీరాముడు సోదరులు, బంధువులు, లోకులు ఎడ మహారాజుగా ఎలా మసిలాడు. ఎవరిని ఉద్దేశించి యాగాలు ఏ విధంగా ఆచరించాడు.”

9-341-వ.
అనిన శుకుం డిట్లనియె.
భావము:-  ఇలా పరీక్షిత్తు అడుగగా శుకముని ఇలా అన్నాడు.

9-342-సీ.
"గవంతుఁడగు రామద్రుండు ప్రీతితో;
దేవోత్తముని సర్వదేవమయునిఁ
నుఁదాన కూర్చి యధ్వరములు చేసెను;
హోతకుఁ దూరుపు నుత్తరంబు
సామగాయకునికి మనదిగ్భాగంబు;
బ్రహ్మకుఁ గ్రమమునఁ డమ రెల్ల
ధ్వర్యునకు శేష మాచార్యునకు నిచ్చి;
సొమ్ములఁ బంచి భూసురుల కొసఁగి
భావము:-

9-342.1-తే.
నదు రెండు పుట్టంబులు నకు నయిన
మెలఁత మంగళసూత్రంబు మినుకుఁ దక్క
వినతుఁడై యుండె; నా రాము వితరణంబు
పాండవోత్తమ! యేమని లుకవచ్చు?
భావము:-  “ఓ పాండవోత్తమా! పరీక్షిత్తూ! సాక్షాత్తు భగవంతుడే ఐన శ్రీరాముడు వినయవంతుడు ప్రీతితో తానే అయిన విష్ణుమూర్తి గురించి అనేక యాగాలు చేసాడు. హోతకు తూర్పుదిక్కు, సామగానం చేసిన వానికి ఉత్తరపు దిక్కు, ఋత్వికునికి దక్షిణపు దిక్కు, అధ్వర్యనికి పడమర దిక్కు, మిగిలినది గురువునకు ఇచ్చివేసాడు. తనకు రెండు వస్త్రాలు, తన భార్యకు మంగళసూత్రంబిళ్ళ ఉంచుకుని మిగిలిన సంపదలను విప్రులకు పంచిపెట్టాడు. ఆ శ్రీరాముని దానశీలత ఎంతని పొగడగలము.

9-343-వ.
అంత నా రామచంద్రుని దానశీలత్వంబునకు మెచ్చి విప్రవరులు దమతమ భూములు మరల నిచ్చి యిట్లనిరి.
భావము:-  అంతట, శ్రీరాముడి వితరణబుద్ధికి మెచ్చుకొని బ్రాహ్మణులు వారందరు ఆయా భూములు వెనుకకు ఇచ్చివేసి ఇలా అన్నారు.

9-344-ఆ.
"రణి వలదు మాకుఁ పసుల కేల? నీ
ఖిలలోక గురుఁడవైన హరివి;
మా మనంబు లందు లయు చీఁకటిఁ బాపు
వ దుదారరుచులఁ బార్థివేంద్ర!"
భావము:-  “రాజా! మునులం అయిన మాకు రాజ్యం ఎందుకు, వద్దు, నీవు సకల లోకాలకు పూజినీయుడవు. విష్ణుమూర్తివి.. నీ దయా కిరణాలు ప్రసరించి, మా మనసులలో కమ్ముకొన్న అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టుము.”

9-345-వ.
అని పలికి బ్రహ్మణ్యదేవుండైన రామచంద్రుని వినయోక్తులం బూజించి మునులు చని; రిట్లు పెద్దకాలంబు రాజ్యంబుచేసి, రాఘవేంద్రుం డొక్కదినంబున.
భావము:-  అని చెప్పి ఆ మునులు దేవోత్తముడైన శ్రీరాముని వినయ వినమ్రులై పూజించి వెళ్ళిపోయారు. ఇలా చాలా కాలం రాజ్యపాలనం చేసి శ్రీరాముడు ఒక రోజు...

9-శ్రీరామాదుల వంశము

9-346-సీ.
సుధపైఁ బుట్టెడు వార్త లాకర్ణించు;
కొఱకునై రాముండు గూఢవృత్తి
డురేయి దిరుగుచో నాగరజనులలో;
నొక్కఁడు దన సతి యొప్పకున్న
నొరునింటఁ గాపురంబున్న చంచలురాలిఁ;
బాయంగలేక చేట్ట నేమి
తా వెఱ్ఱి యగు రామరణీశ్వరుండనే;
బేల! పొమ్మను మాట బిట్టు పలుక
భావము:-

9-346.1-ఆ.
నాలకించి మఱియు నా మాట చారుల
లన జగములోనఁ లుగఁ దెలిసి
సీత నిద్రపోవఁ జెప్పక వాల్మీకి
ర్ణశాలఁ బెట్టఁ నిచె రాత్రి.
భావము:-  రాజ్యంలో జరిగే విశేషాలు స్వయంగా తెలుసుకోడానికి రాముడు మారువేషంలో తిరుగుతున్నాడు. అర్థరాత్రి ప్రజల్లో ఒకడు భార్యతో దెబ్బలాడి, “పరాయి ఇంటిలో కొన్నాళ్ళు కాపురం చేసిన చంచలురాలైన భార్యను ఏలుకోడానికి నేనేమైనా వెఱ్ఱిరాముడను అనుకున్నావా? పోపో.” అని కేకలేస్తుంటే శ్రీరాముడు విన్నాడు. అంతేకాక, చారుల ద్వారా ఈ విషయం లోకంలో వ్యాపించి ఉందని తెలిసికొన్నాడు. ఆదమరచి నిద్రిస్తున్న సీతాదేవిని చెప్పకుండ రాత్రివేళ వాల్మీకి ఆశ్రమంలో విడిచిపెట్టి రమ్మని ఆజ్ఞాపించాడు.

9-347-వ.
అంత; సీతయు గర్భిణి గావునఁ గుశలవు లనియెడి కొడుకులం గనియె; వారికి వాల్మీకి జాతకర్మంబు లొనరించె లక్ష్మణునకు నంగ దుండును, జంద్రకేతుండును భరతునకుఁ దక్షుండును, బుష్కలుం డును శత్రుఘ్నునకు సుబాహుండును, శ్రుతసేనుండును సంభ వించిరి; అయ్యెడ.
భావము:-  అంతట, అప్పటికే కడుపుతో ఉన్న సీతాదేవి కుశలవులను అను పుత్రులను కన్నది. వారికి వాల్మీకి జాతకర్మలు చేసాడు. లక్ష్మణునకు అంగదుడు, చంద్రకేతుడు; భరతునకు దక్షుడు, పుష్కలుడు; శత్రుఘ్నునికి సుబాహుడు, శ్రుతసేనుడు అని ఇద్దరేసి కొడుకులు పుట్టారు. అప్పుడు.

9-348-క.
బంధురబలుఁడగు భరతుఁడు
గంర్వచయంబుఁ ద్రుంచి నకాదుల స
ద్బంధుఁ డగు నన్న కిచ్చెను
బంధువులును మాతృజనులుఁ బ్రజలున్ మెచ్చన్.
భావము:-  బలశాలి అయిన భరతుడు బంధువులు, తల్లులు, లోకులు మెచ్చేలా, గంధర్వులను సంహరించి ధనాన్ని, బంగారాన్ని తీసుకువచ్చి సజ్జనబంధువైన సోదరుడు శ్రీరాముడికి ఇచ్చాడు.

9-349-ఆ.
ధువనంబులోన ధునందనుం డగు
వణుఁ జంపి భుజబలంబు మెఱసి
ధుపురంబు చేసె ధుభాషి శత్రుఘ్నుఁ
న్న రామచంద్రుఁ డౌ ననంగ.
భావము:-  మథురభాషి శత్రుఘ్నుడు తన అన్న రామచంద్రుడు మెచ్చేలా, మధురాసురుని కొడుకు లవణుడిని సంహరించి మధువనంలో మధుపురాన్ని నిర్మించాడు.

9-350-వ.
అంతఁ గొంతకాలంబునకు రామచంద్రుని కొమారులయిన కుశ లవులిద్దఱను వాల్మీకివలన వేదాదివిద్యల యందు నేర్పరులై పెక్కు సభల సతానంబుగా రామకథాశ్లోకంబులు పాడుచు నొక్కనాఁడు రాఘవేంద్రుని యజ్ఞశాలకుం జని.
భావము:-  అంతట కొన్నాళ్ళకు శ్రీరాముని పుత్రులు ఐన కుశుడు లవుడు ఇద్దరు వాల్మీకి వల్ల వేదాది విద్యలలో ఆరితేరారు. అనేక సభలలో స్వరసహితముగా శ్రీరామకథా శ్లోకాలు పాడుతూ ఉన్నారు. ఆ క్రమంలో ఒక దినం శ్రీరాముని యాగశాలకు వెళ్ళి...

9-351-మత్త.
ట్టి మ్రాకులు పల్లవింప నవారియై మధుధార దా
నుట్టఁబాడిన వారిపాటకు నుర్వరాధిపుఁడుం బ్రజల్
బిట్టు సంతస మంది; రయ్యెడఁ బ్రీతిఁ గన్నుల బాష్పముల్
దొట్ట నౌఁదల లూఁచి వారలతోడి మక్కువ పుట్టఁగాన్.
భావము:-  ఆ విధంగా శ్రీరాముని యాగసాలలో ఎండిన మోళ్ళు చిగురించేలా, అమృత ధారలు జాలువారేలా పాడరు. వారి పాటను మహారాజు, ప్రజలు అందరూ తలలూపుతూ, ఆనందభాష్పాలు కారుతుండగా మిక్కిలి సంతోషించారు. అప్పుడు, వారిపై ఎక్కువ మక్కువ కలిగింది.

9-352-వ.
అంతనా రామచంద్రుండు కుమారుల కిట్లనియె.
భావము:-  అప్పుడు శ్రీరాముడు పిల్లలతో ఇలా అన్నాడు.

9-353-ఆ.
"చిన్నయన్నలార! శీతాంశుముఖులార!
ళినదళవిశాలయనులార!
ధురభాషులార! హిమీఁద నెవ్వరు
ల్లిదండ్రి మీకు న్యులార? "
భావము:-  ఓ చిన్ని బాబులు! మీ మోములు చంద్రబింబాల్లా ప్రకాశిస్తున్నాయి. మీ కన్నులు కలువరేకులలా వెడల్పుగా అందంగా ఉన్నాయి. మీ పలుకు మధురంగా ఉన్నాయి. లోకంలో మీలాంటి వారి తల్లిదండ్రులు ధన్యులు; మీ తల్లిదండ్రులు ఎవరు నాయనలారా?
– అని మర్యాదకు మారుపేరైన శ్రీరామచంద్రమూర్తి తన యజ్ఞశాలకి వచ్చి రామకథ గానం చేస్తున్న కుశలవులను ప్రశ్నించాడు. పోతనగారి పాత్రౌచిత్య, సందర్భౌచిత్యమైన లలిత పదాలు, నడక లాలిత్యం ఈ మృదు మధురమైన పద్యంలో ప్రతిఫలిస్తున్నాయి.

9-354-వ.
అనిన వార “లేము వాల్మీకి పౌత్రులము; రాఘవేశ్వరుని యాగంబు చూడ వచ్చితి” మనవుడు; మెల్లన నగి “ యెల్లి ప్రొద్దున మీ తండ్రి నెఱింగెద; రుండుం” డని యొక్క నివాసంబునకు సత్కరించి పనిచె; మఱునాఁడు సీతం దోడ్కొని కుశలవుల ముందట నిడుకొని వాల్మీకి వచ్చి రఘుపుంగవునిం గని యనేక ప్రకారంబుల వినుతించి యిట్లనియె.
భావము:-  ఇలా అడిగిన శ్రీరామునితో వారు ఇలా అన్నారు. “మేము వాల్మీకి మనుమలం. శ్రీరాముని యాగం చూడ్డానికి వచ్చాం.” వారి పలుకులు విని మెల్లిగా నవ్వి, “రేపు ఉదయం మీ తండ్రిని తెలుసుకుందురు గాని, రండి.” అని సత్కరించి పంపించాడు. మరునాడు వాల్మీకిమహర్షి సీతను, కుశలవులను వెంటబెట్టుకొని వచ్చి శ్రీరాముని పెక్కువిధా స్తుతించి ఇలా అన్నాడు.

9-355-ఆ.
"సీత సుద్దరాలు, చిత్తవాక్కర్మంబు
లందు సత్యమూర్తి మలచరిత
పుణ్యసాధ్వి విడువఁ బోలదు చేకొను
వికులాబ్ధిచంద్ర! రామచంద్ర!"
భావము:-  “రామా! రవికులాబ్ధిసోమా! సీతాదేవి పవిత్రురాలు (త్రికరణ శుద్ధిగా) మనోవాక్కాయకర్మలలోను సత్యనిష్ఠగల సాధ్వి, పరిశుద్ధ వర్తనురాలు, మహాపుణ్యాత్మురాలు, పతివ్రత. ఈమెను విడుచుట తగినపని కాదు. స్వీకరించు.”

9-356-వ.
అని వాల్మీకి పలుక, రామచంద్రుండు పుత్రార్థి యై విచారింపఁ, గుశ లవులను వాల్మీకికి నొప్పగించి, రామచంద్రచరణధ్యానంబు చేయుచు నిరాశ యై సీత భూవివరంబు జొచ్చెను; అయ్యెడ.
భావము:-  అని వాల్మీకి చెప్పగా, శ్రీరాముడు కొడుకుల గురించి విచారించాడు. నిరాశచెందిన సీతాదేవి, వాల్మీకికి కుశలవులను అప్పచెప్పి, భర్త పాదాలు ధ్యానిస్తూ భూగర్భములోకి ప్రవేశించింది. అప్పుడు...

9-357-మ.
ముదితా! యేటికిఁ గ్రుంకి తీవు మనలో మోహంబు చింతింపవే
నాంభోజము చూపవే మృదువు నీ వాక్యంబు విన్పింపవే
తుది చేయం దగ దంచు నీశ్వరుఁడునై దుఃఖించె భూపాలుఁ డా
గాదే ప్రియురాలిఁ బాసిన తఱిన్ భావింప నెవ్వారికిన్?
భావము:-  తాను భగవంతుడే అయినా రాముడు సీత కోసం దుఃఖిస్తూ, ఇలా అన్నాడు. “ఓ కాంతా! అయ్యో నీవు ఎందుకు భూమిలోకి కుంగిపోయావు. మన మధ్య ఉన్న ప్రేమను గుర్తుచేసుకో. నీ ముఖపద్మాన్ని చూపించు. నీ మృదుమధుర వాక్కులు వినిపించు. ఇలా నన్ను విడిచి పోవద్దు.” అవును, ఎంతటివారికి అయినా ప్రియురాలు దూరమైతే దుఃఖం కలగుతుంది కదా..

9-358-వ.
అని వగచి, రామచంద్రుండు బ్రహ్మచర్యంబు ధరియించి, పదుమూఁడువేల యేం డ్లెడతెగకుండ నగ్నిహోత్రంబు చెల్లించి తా నీశ్వరుండు గావునఁ దన మొదలినెలవుకుం జనియె నివ్విధంబున.
భావము:-  ఇలా బాధపడిన శ్రీరాముడు బ్రహ్మచర్యం చేపట్టి పదమూడువేల (13,000) సంవత్సరాలు ఎడతెగకుండా హోమాలు నడిపించి భగవంతుడు కనుక తన మూలస్థానం పరమపదానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా....

9-359-ఆ.
దిదేవుఁడైన యా రామచంద్రుని
బ్ధి గట్టు టెంత సురకోటి
జంపు టెంత కపుల సాహాయ్య మది యెంత
సురల కొఱకుఁ గ్రీడ జూపెఁగాక.
భావము:-  దేవతల కోసం లీలలు చూపించడానికి తప్పించి, ఆదిదేవుడైన ఆ రామచంద్ర మూర్తికి సముద్రానికి సేతువు కట్టుట అనగా ఎంతపని? రాక్షససంహారం అనగా ఎంతపని? ఆయనకు వానరులు తోడా అది ఏపాటిదనవచ్చు?

9-360-చ.
శుఁడుగ మ్రొక్కెదన్ లవణవార్ధి విజృంభణతా నివర్తికిన్
దిగధీశమౌళిమణి ర్పణమండిత దివ్యకీర్తికిన్
శతభానుమూర్తికి సుధారుచిభాషికి సాధుపోషికిన్
రథరాజుపట్టికిని దైత్యపతిం బొరిగొన్న జెట్టికిన్.
భావము:-  సాగరుని అహంకారం సర్వం అణచినవానికి; సకల దిర్పాలకుల కిరీటాలలోని మణులు అనె దర్పణాలలో ప్రతిఫలించే గొప్ప యశస్సు గలవానికి; వెలసూర్యులతో సమానమైన ప్రకాశంగల మహామూర్తికి; అమృతం అంత మధురంగా మాట్లాడు వానికి; సాధులను పాలించువానికి; దశరథరాజు కుమారునికి; రావణాసురుని సంహరించిన వీరునికి; వినమ్రుడనై మ్రొక్కుతాను.

9-361-ఉ.
ల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
ల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
ల్లెడువాఁడు నైన రఘుత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్.
భావము:-  నల్లటివాడు, పద్మాలవంటి కళ్ళు గలవాడు, గొప్ప ధనుస్సు బాణాలు ధరించు వాడు, విశాలమైన వక్షస్థలం గలవాడు, మేళ్ళు అనేకం సమకూర్చువాడు, ఎగుభుజాలు గలవాడు, అన్ని దిక్కులకు తన కీర్తిని వ్యాపింపజేసిన వాడు, రఘు కులోత్తముడు అయిన శ్రీరామచంద్రుడు మా కోరికలు తీర్చుగాక.

9-362-ఆ.
రామచంద్రుఁ గూడి రాకలఁ పోకలఁ
దిసి తిరుగువారుఁ న్నవారు
నంటికొన్నవారు నా కోసలప్రజ
రిగి రాదియోగు రుగు గతికి.
భావము:-  శ్రీరామునితో కలిసిమెలసి మెలగిన వారు; తనివితీరా చూసిన వారు; ప్రేమతో తాకిన వారు అయిన ఆ కోసల ప్రజలు ఆదియోగులు పొందే సద్గతిని పొందారు.

9-363-క.
మంనములు సద్గతులకుఁ
బొంనములు ఘనములైన పుణ్యముల కిదా
నీంనపూర్వమహాఘ ని
కృంనములు రామనామ కృతి చింతనముల్.
భావము:-  శ్రీరామచంద్రమూర్తిని గుఱించి చేసెడు తలపులు సద్గతులు కలిగించే ఏకాంతమార్గములు, గొప్ప పుణ్యాలు కలిగిస్తాయి. పూర్వజన్మలలోను , యీ జన్మలోను చేసిన పాపాలను తొలగిస్తాయి. అవి మహిమాన్వితములు.

9-364-వ.
ఆ రామచంద్రునకుఁ గుశుండును, గుశునకు నతిథియు, నతిథికి నిషధుండును, నిషధునకు నభుండును, నభునికిఁ బుండరీకుండును బుండరీకునకు క్షేమధన్వుండును, క్షేమధన్వునకు దేవానీకుండును, దేవానీకునకు నహీనుండును, నహీనునకుఁ బారియాత్రుండును, బారియాత్రునకు బలుండును, బలునకుఁ జలుండును, జలునకు నర్కసంభవుం డగు వజ్రనాభుండును, వజ్రనాభునకు శంఖణుండును, శంఖణునకు విధృతియు, విధృతికి హిరణ్యనాభుండును జనియించి; రతండు జైమిని శిష్యుండైన యాజ్ఞవల్కముని వలన నధ్యాత్మయోగంబు నేర్చి, హృదయకలుషంబులం బాసి యోగచర్యుండయ్యె నా హిరణ్యనాభునకుఁ బుష్యుండును, బుష్యునకు ధ్రువసంధియు, ధ్రువసంధికి సుదర్శనుండును, సుదర్శనునకు నగ్నివర్ణుండును, నగ్నివర్ణునకు శీఘ్రుండును, శీఘ్రునకు మరువను రాజశ్రేష్ఠుండును బుట్టి: రా రాజయోగి సిద్ధుండయి కలాపగ్రామంబున నున్నవాఁడు కలియుగాంతంబున నష్టంబయ్యెడు సూర్యవంశంబుఁ గ్రమ్మఱఁ బుట్టింపంగలవాఁ; డా మరువునకుఁ బ్రశుశ్రుకుండును, నా ప్రశుశ్రుకునకు సంధియు, నతనికి నమర్షణుండును, నా యమర్షణునికి మహస్వంతుండును, నా మహస్వంతునకు విశ్వసాహ్యుండును, నా విశ్వసాహ్యునకు బృహద్బలుండును, జనియించి; రా బృహద్బలుఁడు భారతయుద్ధంబున మీ తండ్రి యగు నభిమన్యు చేత హతుండయ్యె; వినుము.
భావము:-  శ్రీరామునికి కుశుడు; కుశునికి అతిథి; అతిథికి నిషధుడు; నిషధునికి నభుడు; నభునికి పుండరీకుడు; పుండరీకునికి క్షేమధన్వుడును; క్షేమధన్వునికి దేవనీకుడును; దేవానీకునికి అహీనుడు; అహీనునికి పారియాత్రుడు; పారియాత్రునికి బలుడు; బలునికి చలుడు; చలునికి సూర్యాంశతో పుట్టిన వజ్రనాభుడు; వజ్రనాభునికి శంఖణుడు; శంఖణునికి విధృతి; విధృతికి హిరణ్యనాభుడు పుట్టారు. అతడు జైమిని శిష్యుడైన యజ్ఞవల్క మహర్షి నుండి అధ్యాత్మయోగం నేర్చుకొని హృదయంలోని కలతలు అన్నీ విడిచిపెట్టి యోగం ఆచరించాడు. ఆ హిరణ్యనాభునికి పుష్యుడు; పుష్యునికి ధ్రువసంధి; ధ్రువసంధికి సుదర్శనుడు; సుదర్శనునికి అగ్నివర్ణుడు; అగ్నివర్ణునికి శీఘ్రుడు; శీఘ్రునికి మరువు అనె రాజశ్రేష్ఠుడు జన్మించారు. ఆ రాజర్షి యోగసిద్ధి పొంది కలాపగ్రామంలో ఇప్పటికి ఉన్నాడు. కలియుగం చివరలో నాశనమైపోయే సూర్యవంశాన్ని మరల ప్రతిష్టిస్తాడు. ఆ మరువునకు ప్రశుశ్రుకుడు; ఆ ప్రశుశ్రుకునికి సంధి; అతనికి అమర్షణుడు; ఆ అమర్షణునికి మహస్వంతుడు; ఆ మహస్వంతునికి విశ్వసాహ్యుడు; ఆ విశ్వసాహ్యునికి బృహద్బలుడు పుట్టారు. ఆ బృహద్బలుడు భారతయుద్ధంలో మీ తండ్రి అభిమన్యుని చేతిలో మరణించాడు. వినుము.

ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీ మహాభాగవతం బను మహాపురాణాంతర్గతంబైన శ్రీరామకథ మఱియు శ్రీరామదుల వంశము నను కథలు గల పోతన రామాయణం బను ఉపాఖ్యానంబు సుసంపూర్ణంబు