పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : ఈ కవీంద్రు జన్మ

ఈ కవీంద్రు జన్మ


ఆ.
కవీంద్రు జన్మ మీశ్వరునకెతక్క
నొరుల కెప్డు చేతులొగ్గియడుగ
దాఁడుబిడ్డ దేహ మమ్ముకతినునట్లు
కృతుల నమ్ముకొనుటె బ్రతుకుతెరువు?
- వానమామలై వరదాచార్యులు.

బమ్మెర పోతనామాత్యుడనే మహాకవి సార్థక జన్ముడు. కవితా కృతి అంటే కవి ఆత్మ మానసిక పుత్రిక కదా. బతకటం కోసం తన కృతులను అమ్ముకొని జీవించటం అంటే ఆడబిడ్డని అమ్ముకుని బతుకుతున్నట్లు నీచం కదా. అని జీవించిన మహా సంస్కారి, ధీశాలి. ఈయన జీవితంలో భగవంతుని తప్పించి ఇతరులను ఎవ్వరిని చేయిచాచి ఎరుగడు.

ఆధునిక కవీంద్రులలో ఎన్నదగ్గ వాడు వానమాలై వరదాచార్యులు వారు పోతన గురించి వెలిబుచ్చిన సూటి స్పందన ఇది.

ఈ = ఈ పోతనామాత్యుడు అనే; కవీంద్రు = కవులలో మిక్కిలి శ్రేష్ఠుని; జన్మము = జీవితం; ఈశ్వరున్ = భగవంతుని; కై = కోసం; తక్కన్ = తప్పించి; ఒరుల = ఇతరుల; కున్ = వైపు; ఎప్డు = ఎప్పుడు కూడ; చేతులొగ్గి = ఇమ్మని; అడుగదు = అడుగనే అడుగదు; ఆఁడుబిడ్డ = కూతురు; దేహము = శరీరాన్ని; అమ్ముకతినున్ = అమ్ముతు బతకుతున్న; అట్లు = విధంగా; కృతులన్ = రచనలను; అమ్ముకొనుటె = అమ్ముకోడమా; బ్రతుకుతెరువు = బ్రతకటం కోసం.