పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతం – సంక్షిప్త : భాగవతం – సంక్షిప్త



శ్రీరామ

up-arrow

భాగవతము – పోతనాది సంక్షిప్తము

సంకలనం : భాగవత గణనాధ్యాయి

ప్రథమ స్కంధము
నైమిశారణ్య వర్ణనంబు; శౌనకాదుల ప్రశ్నంబు; సూతుండు నారాయణకథా సూచనంబు సేయుట; వ్యాస చింత; నారదాగమనంబు; నారదుని పూర్వకల్ప వృత్తాంతంబు; పుత్రశోకాతురయైన ద్రుపదరాజనందన కర్జునుం డశ్వత్థామం దెచ్చి యొప్పగించి గర్వపరిహారంబు సేయించి విడిపించుట; భీష్మనిర్యాణంబు; ధర్మనందను రాజ్యాభిషేకంబు; గోవిందుని ద్వారకాగమనంబు; విరాటకన్యకాగర్భ విద్యమానుండైన యర్భకు నశ్వత్థామ బాణానలంబు వలనం బాపి విష్ణుండు రక్షించుట; పరీక్షిజ్జన్మంబు; గాంధారీ ధృతరాష్ట్ర విదురుల నిర్గమంబు; నారదుండు ధర్మజునకుఁ గాలసూచనంబు సేయుట; కృష్ణ నిర్యాణంబు విని పాండవులు మహాపథంబునం జనుట; యభిమన్యుపుత్రుండు దిగ్విజయంబు సేయుచు శూద్రరాజలక్షణ లక్షితుండగు కలిగర్వంబు సర్వంబు మాపి గోవృషాకారంబులనున్న ధరణీ ధర్మదేవతల నుద్ధరించుట; శృంగిశాపభీతుండై యుత్తరానందనుండు గంగాతీరంబునం బ్రాయోపవేశంబున నుండి శుకసందర్శనంబు సేసి మోక్షోపాయం బడుగట.

ద్వితీయ స్కంధము
పరీక్షిత్తుతోడ శుకయోగి భాషించుట; భాగవతపురాణ వైభవంబు; ఖట్వాంగు మోక్షప్రకారంబు; ధారఁణాయోగ విషయం బయిన మహావిష్ణుని శ్రీపాదాద్యవయవంబుల సర్వలోకంబులు నున్న తెఱంగు; సత్పురుష వృత్తి; మోక్షవ్యతిరిక్త సర్వకామ్యఫలప్రదదేవత భజన ప్రకారంబు; మోక్షప్రదుండు శ్రీహరి యనుట; హరిభజనవిరహితులైన జనులకు హేయతాపాదనంబు; రాజప్రశ్నంబు; శుకయోగి శ్రీహరి స్తోత్రంబు సేయుట; వాసుదేవ ప్రసాదంబునం జతుర్ముఖుండు బ్రహ్మాధిపత్యంబు వడయుట; శ్రీహరి వలన బ్రహ్మరుద్రాదిలోక ప్రపంచంబు వుట్టుట; శ్రీమన్నారాయణ దివ్యలీలావతార పరంపరా వైభవ వృత్తాంతసూచనంబు; భాగవత వైభవంబు; బరీక్షిత్తు శుకయోగి నడిగిన ప్రపంచాది ప్రశ్నంబులు; యందు శ్రీహరి ప్రధానకర్తయని తద్వృత్తాంతంబు సెప్పుట; భగవద్భక్తి వైభవంబు; బ్రహ్మ తపశ్చరణంబునకుం బ్రసన్నుండై హరి వైకుంఠనగరంబుతోడఁ బ్రసన్నుండయిన స్తోత్రంబు సేసి తత్ప్రసాదంబునం దన్మహిమంబు వినుట; వాసుదేవుం డానతిచ్చిన ప్రకారంబున బ్రహ్మ నారదునికి భాగవతపురాణ ప్రధాన దశలక్షణంబు లుపన్యసించుట; నారాయణ వైభవంబు; జీవాది తత్త్వసృష్టి; శ్రీహరి నిత్యవిభూత్యాది వర్ణనంబుఁ; కల్పప్రకారాది సూచనంబు; శౌనకుండు విదుర, మైత్రేయ సంవాదంబు సెప్పమని సూతు నడుగుట.

తృతీయ స్కంధము
విదురనీతియు విదురుని తీర్థాగమనంబు; యుద్ధవ సందర్శనంబు; కౌరవ యాదవ కృష్ణాది నిర్యాణంబు; గంగాద్వారంబున విదురుండు మైత్రేయునిం గనుగొనుట; విదుర మైత్రేయ సంవాదంబు; జగదుత్పత్తి లక్షణంబు; మహదాదుల సంభవ ప్రకారంబు; మహదాదులు నారాయణు నభినందించుట; విరాడ్విగ్రహ ప్రకారంబు; శ్రీమహాభాగవత భక్తి కారణంబగు పద్మసంభవు జన్మప్రకారంబు; బ్రహ్మతపంబు; పరమేష్టికిఁ బుండరీకాక్షుండు ప్రత్యక్షంబగుట; బ్రహ్మకృతంబైన విష్ణుస్తోత్రంబు; గమలసంభవుని మానససర్గంబు; బరమాణువుల పుట్టువు; భూర్భువస్సురాది లోకవిస్తారంబు; కాల దివస మాస వత్సరాది నిర్ణయంబు; నాయుఃపరిమాణంబు; చతుర్యుగ పరిమాణంబు; పద్మసంభవు సృష్టిభేదనంబు; సనకాదుల జన్మంబు; స్వాయంభువమనువు జన్మంబు; శ్రీహరి వరాహావతారంబు; భూమ్యుద్ధరణంబు; సూకరాకారుండైన హరిని విధాత స్తుతించుట;

దితి కశ్యప సంవాదంబు; కశ్యపుండు రుద్రుని బ్రశంసించుట; కశ్యపువలన దితి గర్భంబు ధరించుట; తత్ప్రభావంబునకు వెఱచి దేవతలు బ్రహ్మసన్నధికిం జని దితిగర్భప్రకారంబు విన్నవించుట; సనకాదులు వైకుంఠంబున కరుగుట; యందు జయవిజయుల కలిగి సనకాదులు శపించుట; శ్రీహరిదర్శనంబు; సనకాదులు హరిని నుతించుట; బ్రాహ్మణ ప్రశంస; హిరణ్యకశిపు హిరణ్యాక్షుల జన్మప్రకారంబు; హిరణ్యాక్షుని దిగ్విజయంబు; సవనవరాహ హిరణ్యాక్షుల యుద్ధంబు; బ్రహ్మస్తవంబు; హిరణ్యాక్ష వధ; నమరగణంబులు శ్రీహరి నభినందించుట; హరి వరాహావతార విసర్జనంబు సేయుట; దేవ తిర్యఙ్మనుష్యాదుల సంభవంబు; కర్దమమహాముని తపంబునకు సంతసించి శ్రీహరి ప్రత్యక్షంబగుట; కర్దముండు స్వాయంభువమనుపుత్రి యైన దేవహూతిం బరిణయం బగుట; దేవహూతి పరిచర్యలకు సంతసిల్లి కర్దముండు నిజయోగ కలితం బగు విమానంబు నందు నిలిచి సహస్రదాసీపరివృత యైన దేవహూతింగూడి భారతాది వర్షంబులు గలయంగ్రుమ్మరుట; దేవహూతి గర్దమునివలనఁ గన్యకానవకంబును గపిలుని గనుట; తత్కన్యకావివాహంబులుఁ; కర్దముని తపోయాత్ర; కపిల దేవహూతి సంవాదంబు; శబ్దాదిపంచతన్మాత్రల జన్మప్రకారంబు; బ్రహ్మాండోత్పత్తి; విరాట్పురుష కర్మేంద్రియ పరమాత్మ ప్రకారంబు; ప్రకృతిపురుష వివేకంబు; నారాయణుని సర్వాంగస్తోత్రంబు; సాంఖ్యయోగంబు; భక్తియోగంబు; జీవునకైన గర్భసంభవ ప్రకారంబు; చంద్ర సూర్య మార్గంబు; పిత్రుమార్గంబు; దేవహూతి నిర్యాణంబు; కపిలమహాముని తపంబునకు జనుట.

చతుర్థ స్కంధము
స్వాయంభువ మనువునకు నాకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రియవ్రతోత్తానపాదులు జన్మించుట; యందు నాకూతిని రుచిప్రజాపతికి నిచ్చుట; యా రుచిప్రజాపతికి నాకూతిదేవి యందు శ్రీ విష్ణుమూర్త్యంశజుండైన యజ్ఞుండు; లక్ష్మీ కళాంశజ యగు దక్షిణ యను కన్యకయు నుద్భవించుట; మనుపుత్రి యైన దేవహూతినిఁ గర్దమున కిచ్చుట; ప్రసూతిం దక్షప్రజాపతి కిచ్చుట; ప్రసూతి దక్షుల వలనం బ్రజాపరంపరలు గలుగుట; మఱియుం గర్దమప్రజాపతి పుత్రికాసముదయంబును క్షత్త్ర బ్రహ్మర్షుల కిచ్చుట; కర్దమ పుత్రి యైన కళవలన మరీచికిఁ గశ్యపుం డను పుత్రుండును బూర్ణిమ యను కూఁతునుం బుట్టుట; పూర్ణిమవలన గంగయు విరజుం డనెడు కుమారుండును జన్మించుట; కశ్యపప్రజాపతివలన నయిన ప్రజాపరంపరలచే ముల్లోకంబు లాపూర్ణంబు లగుట; యత్రిమహాముని తపంబు; యతనికి హరి హర బ్రహ్మలు ప్రత్యక్షం బగుట; యనసూయా పాతివ్రత్య మాహాత్మ్యంబువలన ననసూయాత్రులకుం ద్రిమూర్తుల కళాంశజు లయిన చంద్ర దత్తాత్రేయ దుర్వాసుల జన్మంబు; దక్షాత్మజల జన్మంబు; భృగువువలన ఖ్యాతి యను నంగనకు శ్రీమహాలక్ష్మి జన్మించుట; భృగు పౌత్రుం డయిన మార్కండేయ జన్మంబు; ధర్మునకు మూర్తివలన నరనారాయణులు సంభవించుట; సత్త్రయాగంబునందు దక్షుండు శివుని నిందించుట; దక్షాధ్వర ధ్వంసంబు; బ్రహ్మచేఁ బ్రార్థితుండై శివుండు దక్షాదుల ననుగ్రహించుట; దక్షాది కృత శ్రీహరిస్తవంబు; శ్రీహరి ప్రసన్నుండై దక్షుని యజ్ఞంబు సఫలంబుగా ననుగ్రహించుట; సతీదేవి హిమవంతునకు జనించి హరునకు బ్రాపించుట; యుత్తానపాదుని వృత్తాంతంబు;

ధ్రువోపాఖ్యానంబు; ధ్రువుండు దండ్రిచేత నవమానితుండై నారదోపదేశంబున మధువనంబునకుం జని తపంబు చేయుట; హరి ప్రసన్నుండై యతని మనోరథంబు లిచ్చుట; యతండు మరలఁ బురంబునకు వచ్చుట; కుబేరానుచరులైన యక్షులతోడి యుద్ధంబు; ధ్రువుండు యజ్ఞంబులు చేయుచు రాజ్యభోగంబులం దనిసి తనయు నుల్కలునిం బట్టంబుగట్టి హరి యనుగ్రహంబున ధ్రువక్షితిని నిలుచుట; యుల్కలుండు వత్సరుండను తన సుతునిఁ బట్టంబు గట్టి హరిం జేరుట; వత్సరుని వంశపరంపర; యందు నంగుని సుతుండయిన వేను కళేబరంబున లక్ష్మీనారాయణుల యంశంబున నర్చియుఁ బృథుండును జన్మించుట; పృథుండు భూమిం గామధేనువు రీతి నఖిల వస్తువులుం బిదుక నియమించి సమస్థలిం జేసి యింద్రుండు వశవర్తియై యుండ బహుయజ్ఞంబులు చేసిన నతనికి హరి ప్రత్యక్షంబగుట; యధ్యాత్మ ప్రబోధంబు; యింద్రునివలనఁ బాషండ సంభవంబు; యింద్రుని జయించిన విజితాశ్వుని నతని తమ్ములను బృథివీపాలనంబునకు నిలిపి పృథుండు నర్చియుం బరమపదప్రాప్తు లగుట; వసిష్ఠుశాపంబునఁ ద్రేతాగ్నులు విజితాశ్వునికిఁ దనయులై జనియించుట; పృథుని పౌత్రుండయిన ప్రాచీనబర్హి రాజ్యంబును నతని యజ్ఞంబు లసంఖ్యాతంబులైన నారదుండు మాన్పందలంచి పురంజను కథ నధ్యాత్మ ప్రపంచంబుగాఁ దెలుపుట; ప్రాచీనబర్హి సుతులయిన ప్రచేతసులు పదువురకు శ్రీ మహాదేవుండు ప్రత్యక్షంబై హరిస్తవం బుపదేశించుట; ప్రచేతసుల తపంబునకు మెచ్చి హరి బ్రత్యక్షంబగుట; వారికి మారిష వలన దక్షుండు పూర్వకాలంబున శివవిద్వేష ప్రయుక్త శాపంబునం బుత్రుండై జనియించుట; ప్రచేతసులు ముక్తికిం జనుట; విదురుండు మైత్రేయుని వీడ్కొని హస్తిపురంబు కరుగుట.

పంచమ స్కంధము - పూర్వాశ్వాసము
ప్రియవ్రతుని సుజ్ఞాన దీక్ష; బ్రహ్మదర్శనంబు; యాగ్నీధ్రాదుల జన్మంబు; యుత్తమ తామస రైవతుల జన్మంబు; ప్రియవ్రతుండు వనంబునకుం జనుట; యాగ్నీధ్రుం డప్సరసం బరిగ్రహించుట; వర్షాధిపతుల జన్మంబు; యాగ్నీధ్రుండు వనంబునకుం జనుట; నాభి ప్రముఖుల రాజ్యంబు; నాభి యజ్ఞంబు; ఋషభుని జన్మంబు; ఋషభుని రాజ్యభిషేకంబు; భరతుని జన్మంబు; ఋషభుండు దపంబునకుఁ జనుచు సుతులకు నతుల జ్ఞానం బుపదేశించుట; భరతుని పట్టాభిషేకంబు; భరతుండు వనంబునకుఁ జనుట; భరతుండు హరిణపోతంబునందలి ప్రీతింజేసి హరిణగర్భంబున జనించుట; మరల విప్రసుతుండై జనియించుట; విప్రుండు చండికాగృహంబున బ్రదికివచ్చుట; సింధుపతి విప్ర సంవాదంబు.

పంచమ స్కంధము - ఉత్తరాశ్వాసము
భరతాత్మజుండైన సుమతికి రాజ్యాభిషేకంబు; పాషండదర్శనంబు; సుమతి పుత్ర జన్మ విస్తారంబు; గయుని చరిత్రంబు; గయుని సంస్తుతి; భూ ద్వీప వర్ష సరిదద్రి నభస్సముద్ర పాతాళ దిఙ్నరక తారాగణ సంస్థితి.

షష్ఠ స్కంధము
అజామిళోపాఖ్యానంబు; ప్రచేతసులఁ జంద్రు డామంత్రణంబు చేయుట; దక్షోత్పత్తి; ప్రజాసర్గంబు; దక్షుండు శ్రీహరింగూర్చి తపంబు చేయుట; యతనికి నప్పరమేశ్వరుండు ప్రత్యక్షం బగుట; హర్యశ్వ జన్మంబు; వారలకు నారదుండు బోధించుట; నారదు వచన ప్రకారంబునవారు మోక్షంబు నొందుట; దద్వృత్తాంతంబు నారదు వలన విని దక్షుండు దుఃఖాక్రాంతుం డగుట; తదనంతరంబ బ్రహ్మవరంబున దక్షుండు శబళాశ్వసంజ్ఞల సహస్ర సంఖ్యాకులగు పుత్రులం గాంచుట; సృష్టినిర్మాణేచ్ఛా నిమిత్తంబున దక్షు పంపున వార లగ్రజన్ములు సిద్ధింబొందిన తీర్థరాజంబైన నారాయణ సరస్సునకుం జనుట; వారికి నారదభగవంతుండు బ్రహ్మజ్ఞానంబు నుపదేశించుట; వారు పూర్వజు లేగిన ప్రకారంబున మోక్షంబు నొందుట; తద్వృత్తాంతంబును దక్షుండు దివ్యజ్ఞానంబున నెఱింగి నారదోపదిష్టం బని తెలిసి నారదుని శపించుట; నారదుండు దక్షుశాపంబు ప్రతిగ్రహించుట; దక్షునకు బ్రహ్మవరంబున సృష్టివిస్తారంబు కొఱకుఁ గూతులఱువండ్రు జనియించుట; యందు గశ్యపునకు నిచ్చిన పదమువ్వురు వలన సకల లోకంబులు నిండుట; దేవాసుర నర తిర్యఙ్మృగ ఖగాదుల జన్మంబులు;

దేవేంద్ర తిరస్కారంబున బృహస్పతి యధ్యాత్మమాయచేతం గాన రాకుండుట; తద్వృత్తాంతంబు రాక్షసులు విని శుక్రోపదిష్టులై దేవతలపై నెత్తివచ్చుట; దేవాసుర యుద్ధంబు; యాచార్యతిరస్కారంబున దివిజరాజపలాయనంబు; బలాయమానులైన దేవతలు బ్రహ్మసన్నిధికిం జనుట; బ్రహ్మవాక్యంబునఁ ద్వష్ట కుమారుండయిన విశ్వరూపు నాచార్యునింగా దేవతలు వరించుట; విశ్వరూపు ప్రసాదంబున నింద్రుండు నారాయణ వర్మం బను మంత్రకవచంబు ధరియించి రాక్షసుల జయించుట; పరోక్షంబున రాక్షసులకు ననుకూలుం డయిన విశ్వరూపు నింద్రుండు వధియించుట; విశ్వరూపు వధానంతరంబున నింద్రునకు బ్రహ్మ హత్య సంప్రాప్తం బయిన నింద్రుండు స్త్రీ భూ జల ద్రుమంబుల యందుఁ బంచిపెట్టుట; విశ్వరూపుండు హతుండగుటకుఁ ద్వష్ట గోపించి యింద్రవదార్థంబు మారణహోమంబు చేయ వృత్రాసురుండు జనించుట; వృత్రాసుర యుద్ధంబునఁ బరాజితులై యింద్ర సహితు లయిన దేవతలు శ్వేతద్వీపంబునకుం జనుట; యందు శ్రీహరి ప్రసన్నుండయి దధీచి వలన భిదురంబు గైకొన నుపదేశించుట; యింద్రుండు వజ్రాయుధంబున వృత్రుని సంహరించుట; యింద్రుండు బ్రహ్మహత్యా పీడితుండయి మానససరస్సు ప్రవేశించుట; నహుషుండు శతాశ్వమేధంబులం జేసి యింద్రాధిపత్యంబు బడయుట; నహుషుండు డగస్త్యశాపంబున సురరాజ్యచ్యుతుండై యజగర యోనిం బుట్టుట; యింద్రాగమనంబు; యశ్వమేధంబు; యింద్రుండు మరలఁ ద్రిలోకాధిపత్యంబు బడయుట; జిత్రకేతూపాఖ్యానంబు; మరుద్గణంబుల జన్మప్రకారంబు.

సప్తమ స్కంధము
ధర్మనందనునకు నారదుండు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల పూర్వజన్మ వృత్తాంతంబు చెప్పుట; హిరణ్యకశిపు దితి సంవాదంబు; సుయజ్ఞోపాఖ్యానంబు; ప్రేతబంధు యమ సల్లాపంబు; బ్రహ్మవర లాభ గర్వితుండైన హిరణ్యకశిపు చరిత్రంబు; ప్రహ్లాద విద్యాభ్యాస కథ; ప్రహ్లాద హిరణ్యకశిపు సంవాదంబు; ప్రహ్లాదవచనంబు ప్రతిష్ఠింప హరి నరసింహ రూపంబున నావిర్భవించి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదునకు నభయం బిచ్చి నిఖిలదేవతానివహ ప్రహ్లాదాది స్తూయమానుండై తిరోహితుం డగుట; త్రిపురాసుర వృత్తాంతంబు; యీశ్వరుండు త్రిపురంబుల దహించుట; వర్ణాశ్రమధర్మ వివరణంబు; ప్రహ్లాదాజగర సంవాదంబు; స్వధర్మ ప్రవర్తకుఁ డగు గృహస్థుండు ముక్తుం డగు మార్గంబు నారదుండు ధర్మరాజునకుఁ దెలుపుట; నారదుని పూర్వజన్మ వృత్తాంతంబు.

అష్టమ స్కంధము
స్వాయంభువ స్వారోచిషోత్తమ తామస మనువుల చరిత్రంబు; కరిమకరంబుల యుద్ధంబు; గజేంద్ర రక్షణంబు; రైవత చాక్షుష మనువుల వర్తనంబు; సముద్ర మథనంబు; కూర్మావతారంబు; గరళ భక్షణంబు; యమృతాది సంభవంబు; దేవాసుర కలహంబు; హరి కపటకామినీ రూపంబున నసురుల వంచించి దేవతల కమృతంబు పోయుట; రాక్షస వధంబు; హరిహర సల్లాపంబు; హరి కపటకామినీరూప విభ్రమణంబు; వైవశ్వత సూర్యసావర్ణి దక్షసావర్ణి బ్రహ్మసావర్ణి భద్రసావర్ణి దేవసావర్ణీంద్రసావర్ణి మనువుల వృత్తాంతంబులు; బలి యుద్ధయాత్ర; స్వర్గవర్ణనంబు; దేవ పలాయనంబు; వామనావతారంబు; శుక్ర బలి సంవాదంబు; త్రివిక్రమ విస్ఫురణంబు; రాక్షసుల సుతల గమనంబు; సత్యవ్రతోపాఖ్యానంబు; మీనావతారంబు.

నవమ స్కంధము
సూర్యవంశారంభంబు; వైవస్వతమనువు జన్మంబు; హైమచంద్ర కథనంబు; సుద్యుమ్నాదిమను సూనుల చరిత్రంబు; మరుత్తు, తృణబిందు, శర్యాతి, కకుద్మి, సగర, నాభాగ ప్రముఖుల చరిత్రంబులు; యంబరీషుని యందుఁ బ్రయోగింపబడిన దుర్వాసుని కృత్యనిరర్థక యగుట; యిక్ష్వాకు, వికుక్షి, మాంధాతృ, పురుకుత్స, హరిశ్చంద్ర, సగర, భగీరథ, ప్రముఖుల చరిత్రంబులు; భాగీరథీప్రవాహ వర్ణనంబు; కల్మాషపాద, ఖట్వాంగ ప్రముఖుల వృత్తాంతంబు; శ్రీరామచంద్ర కథనంబు; తదీయ వంశపరంపరా గణనంబు; నిమికథ;

చంద్రవంశారంభంబు; బుధ, పురూరవుల కథ; జమదగ్ని, పరశురాముల వృత్తాంతంబు; విశ్వామిత్ర, నహుష, యయాతి, పూరు, దుష్యంత, భరత, రంతిదేవ, పాంచాల, బృహద్రథ, శంతను, భీష్మ, పాండవ, కౌరవ ప్రముఖుల వృత్తాంతంబు; ఋశ్యశృంగ వ్రతభంగంబు; ద్రుహ్యానుతుర్వసుల వంశంబు; యదు, కార్తవీర్య, శశిబిందు, జామదగ్న్యాదుల చరిత్రంబు; శ్రీకృష్ణావతార కథాసూచనంబు.

కృష్ణకథాసుధారసము

దశమ స్కంధము - మొదటి భాగము
దేవకీదేవి వివాహంబు; గగనవాణీ శ్రవణంబు; కంసోద్రేకంబు; వసుదేవ ప్రార్థనయు; యోగమాయా ప్రభావంబు; బలభద్రుని జన్మంబు; బ్రహ్మాది సుర స్తోత్రంబు; కృష్ణావతారంబు; ఘోష ప్రవేశంబు; యోగనిద్రా చరితంబు; నంద పుత్రోత్సవంబు; పూతనా సంహారంబు; శకట భంజనంబు; తృణావర్తు మరణంబు; గర్గాగమనంబు; నారాయణాది నామ నిర్దేశంబు; బాలక్రీడయు; మృద్భక్షణంబు; వాసుదేవ వదనగహ్వర విలోక్యమా నాఖిల లోకాలోకనంబు; నవనీత చౌర్యంబు; యశోదా రోషంబు; యులూఖల బంధనంబు; యర్జునతరు యుగళ నిపాతనంబు; నలకూబర మణిగ్రీవుల శాప మోక్షణంబు; బృందావన గమనంబు; వత్స పాలనంబు; వత్సాసుర వధయు; బకదనుజ విదారణంబు; యఘాసుర మరణంబు; వత్సాపహరణంబు; నూతన వత్స బాలక కల్పనంబు; బ్రహ్మ వినుతియు; గోపాలకత్వంబు; గార్దభాసుర దమనంబు; కాళియ ఫణి మర్దనంబు; గరుడ, కాళియ నాగ విరోధ కథనంబు; ప్రలంబాసుర హింసనంబు; దవానల పానంబు; వర్షర్తు వర్ణనంబు; శరత్కాల లక్షణంబు; వేణు విలాసంబు; హేమంత సమయ సమాగమంబు; గోపకన్యాచరిత హవిష్య వ్రతంబు; కాత్యాయనీ సేవనంబు; వల్లవీ వస్త్రాపహరణంబు; విప్రవనితా దత్తాన్న భోజనంబు; యింద్రయాగ నివారణంబు; నంద ముకుంద సంవాదంబు; పర్వత భజనంబు; బాషాణ సలిల వర్షంబు; గోవర్ధనోద్ధరణంబు; వరుణకింకరుండు నందుని గొనిపోయిన హరి తెచ్చుటయు; వేణు పూరణంబు; గోపికాజన ఘోష నిర్గమంబు; యమునాతీర వన విహరణంబు; గృష్ణాంతర్ధానంబు; ఘోషకామనీ గణాన్వేషణంబు; గోపికా గీతలు; హరి ప్రసన్నతయు; రాస క్రీడనంబు; జలకేళి; సర్పరూపకుండైన సుదర్శన విద్యాధరుండు హరిచరణ తాడనంబున నిజరూపంబు పడయుటయు; శంఖచూడుం డను గుహ్యకుని వధించుటయు; వృషభాసుర విదళనంబు; నారదోపదేశంబున హరి జన్మకథ నెఱంగి కంసుండు దేవకీవసుదేవుల బద్ధులం జేయుటయు; ఘోటకాసురుండైన కేశియను దనుజుని వధియించుటయు; నారద స్తుతియు; వ్యోమదానవ మరణంబు; యక్రూరాగమంబు; యక్రూర రామకృష్ణుల సల్లాపంబు;

ఘోష నిర్గమంబు; యమునా జలాంతరాళంబున నక్రూరుండు హరి విశ్వరూపంబును గాంచుటయు; యక్రూర స్తవంబు; మథురానగర ప్రవేశంబు; రజక వధయు; వాయక, మాలికులచే సమ్మానంబు నొందుటయు; కుబ్జా ప్రసాదకరణంబు; ధనుర్భంగంబు; గంసు దుస్వప్నంబు; గువలయాపీడ పీడనంబు; రంగస్థల ప్రవేశంబు; చాణూర ముష్టికుల వధయు; కంస వధయు; వసుదేవదేవకీ బంధమోక్షణంబు; యుగ్రసేను రాజ్య స్థాపనంబు; రామకృష్ణులు సాందీపుని వలన విద్య లభ్యసించుటయు; సంయమనీ నగర గమనంబు; గురుపుత్ర దానంబు; యుద్ధవుని ఘోష యాత్రయు; భ్రమరగీతలు; కుబ్జావాస గమనంబు; కరినగరంబునకు నక్రూరుండు చని కుంతీదేవి నూరార్చుటయు; కంసభార్యలగు నస్తి ప్రాస్తులు జరాసంధునకుఁ గంసు మరణం బెఱింగించుటయు; జరాసంధుని దండయాత్రయు; మథురానగర నిరోధంబు; యుద్ధంబున జరాసంధుండు సప్తదశ వారంబులు పలాయితుం డగుటయు; నారద ప్రేరితుండై కాలయవనుండు మథురపై దాడివెడలుటయు; ద్వారకానగర నిర్మాణంబు; మథురాపుర నివాసులం దన యోగబలంబున హరి ద్వారకానగరంబునకుం దెచ్చుటయు; కాలయవనుడు హరి వెంటజని గిరిగుహ యందు నిద్రితుండైన ముచికుందుని దృష్టి వలన నీఱగుటయు; ముచికుందుండు హరిని సంస్తుతి చేసి తపంబునకుం జనుటయు; జరాసంధుండు గ్రమ్మఱ రామకృష్ణులపై నేతెంచుటయు; ప్రవర్షణ పర్వతారోహణంబు; గిరి దహనంబు; గిరి డిగ్గనుఱికి రామకృష్ణులు ద్వారకకుం జనుటయు; రుక్మిణీ జననంబు; రుక్మిణీ సందేశంబు; వాసుదేవాగమనంబు; రుక్మిణీ గ్రహణంబు; రాజలోక పలాయనంబు; రుక్మి యనువాని భంగంబు; రుక్మిణీ కల్యాణంబు.

దశమ స్కంధము - రెండవ భాగము
ప్రద్యుమ్న జన్మంబు; శంబరోద్యోగంబు; సత్రాజిత్తునకు సూర్యుండు శమంతకమణి నిచ్చుటయుఁ దన్నిమిత్తంబునం ప్రసేనుని సింహంబు వధియించుట; దాని జాంబవంతుండు దునిమి మాణిక్యంబు గొనిపోవుట; గోవిందుండు ప్రసేనుని దునిమి మణిఁ గొనిపోయె నని సత్త్రాజిత్తు కృష్ణునందు నిందనారోపించుట; కృష్ణుండు దన్నిమిత్తంబున జాంబవంతునిం దొడరి మణియుక్తంబుగా జాంబవతిం గొనివచ్చి వివాహం బగుట; సత్త్రాజిత్తునకు మణి నిచ్చుట; సత్యభామా పరిణయంబు; పాండవులు లాక్షాగృహంబున దగ్ధులైరని విని వాసుదేవుండు బలభద్ర సహితుం డయి హస్తినాపురంబున కరుగుట; యక్రూర కృతవర్మల యనుమతంబున శతధన్వుండు సత్త్రాజిత్తుఁ జంపి మణిఁ గొనిపోవుట; తదర్థం బా సత్యభామ కరినగరంబున కేగి కృష్ణునకు విన్నవించిన నతండు మరలి చనుదెంచి శతధన్వుం ద్రుంచుట; బలభద్రుండు మిథిలానగరంబునకుం జనుట; యందు దుర్యోధనుండు రామునివలన గదావిద్య నభ్యసించుట; కృష్ణుండు సత్రాజిత్తునకుం బరలోకక్రియలు నడపుట; శమంతకమణిం దాఁచిన వాఁడయి యక్రూరుండు భయంబున ద్వారకానగరంబు విడిచిపోయిన నతని లేమి ననావృష్టి యైనం గృష్ణుం డక్రూరుని మరల రప్పించుట;

దామోదరుం డింద్రప్రస్థపురంబున కరుగుట; యందర్జున సమేతుండయి మృగయావినోదార్థం బరణ్యంబునకుం జని; కాళిందిం గొనివచ్చుట; ఖాండవ దహనంబు; యగ్నిపురుషుం డర్జునునకు నక్షయతూణీర, గాండీవ, కవచ, రథ, రథ్యంబుల నిచ్చుట; మయుండు ధర్మరాజునకు సభ గావించి యిచ్చుట; నగధరుండు మరలి నిజనగరంబున కరుగుదెంచి కాళిందిని వివాహంబగుట; మిత్రవిందా, నాగ్నజితీ, భద్రా, మద్రరాజకన్యలం గ్రమంబునఁ గరగ్రహణం బగుట; నరకాసుర యుద్ధంబు; తద్గృహంబున నున్న రాజకన్యకలం బదాఱువేలం దెచ్చుట; స్వర్గగమనంబు; నదితికిం గుండలంబు లిచ్చుట; పారిజాతాపహరణంబు; పదాఱువేల రాజకన్యలం బరిణయం బగుట; రుక్మిణీదేవి విప్రలంభంబు; రుక్మిణీ స్తోత్రంబు; కృష్ణకుమారోత్పత్తి; తద్గురు జనసంఖ్య; ప్రద్యుమ్ను వివాహంబు; యనిరుద్ధు జన్మంబు; తద్వివాహార్థంబు కుండిననగరంబునకుం జనుట; రుక్మి బలభద్రుల జూదంబు; రుక్మి వధ; యుషాకన్య యనిరుద్ధుని స్వప్నంబునం గని మోహించుట; తన్నిమిత్తంబునఁ చిత్రరేఖ సకలదేశ రాజులఁ బటంబున లిఖించి చూపి యనిరుద్ధునిఁ దెచ్చుట; బాణాసుర యుద్ధంబు; నృగోపాఖ్యానంబు; బలభద్రుని ఘోష యాత్ర; కాళింది భేదనంబు; కృష్ణుండు పౌండ్రక వాసుదేవ కాశీరాజుల వధించుట; కాశీరాజపుత్రుం డయిన సుదక్షిణుం డభిచారహోమంబు గావించి కృత్యం బడసి కృష్ణుపాలికిం బుత్తెంచిన సుదర్శనంబుచేతఁ గృత్యను సుదక్షిణ సహితంబుగాఁ గాశీపురంబును భస్మంబు సేయుట; బలరాముండు రైవతనగరంబు నందు ద్వివిదుండను వనచరుని వధియించుట;

సాంబుండు దుర్యోధనుకూఁతురగు లక్షణ నెత్తికొనివచ్చినఁ గౌరవు లతనిం గొనిపోయి చెఱఁబెట్టుట; తద్వృత్తాంతం బంతయు నారదువలన విని బలభద్రుండు నాగనగరంబునకుఁ జనుట; కౌరవులాడిన యగౌరవవచనంబులకు బలరాముండు కోపించి హస్తినాపురంబును గంగం బడఁద్రోయ గమకించుట; కౌరవులు భయంబున నంగనాయుక్తంబుగా సాంబునిం దెచ్చి యిచ్చుట; బలభద్రుండు ద్వారకానగరంబునకు వచ్చుట; నారదుండు హరి పదాఱువేల కన్యకల నొకముహూర్తంబున నందఱ కన్నిరూపులై వివాహంబయ్యె నని విని తత్ప్రభావంబు దెలియంగోరి యరుగుదెంచుట; తన్మాహాత్మ్యంబు సూచి మరలి చనుట; జరాసంధునిచేత బద్ధు లైన రాజులు కృష్ణు పాలికి దూతం బుత్తెంచుట; నారదాగమనంబు; పాండవుల ప్రశంస; యుద్ధవ కార్యబోధంబు; యింద్రప్రస్థాగమనంబు; ధర్మరాజు రాజసూయారంభంబు; దిగ్విజయంబు; జరాసంధ వధ; రాజ బంధమోక్షణంబు; రాజసూయంబు నెఱవేర్చుట; శిశుపాల వధ; యవభృథంబు; రాజసూయవైభవ దర్శనాసహమానమానసుండయి సుయోధనుండు మయనిర్మిత సభామధ్యంబునం గట్టిన పుట్టంబులు దడియం ద్రెళ్ళుట; తన్నిమిత్తపరిభవంబు నొంది రారాజు నిజపురి కరుగుట; కృష్ణుండు ధర్మరాజ ప్రార్థితుం డయి యాదవుల నిలిపి కొన్ని నెలలు ఖాండవప్రస్థంబున వసియించుట; సాళ్వుండు దపంబు సేసి హరుని మెప్పించి సౌభకాఖ్యం బగు విమానంబు వడసి నిజసైన్య సమేతుండై ద్వారకానగరంబు నిరోధించుట; యాదవ సాళ్వ యుద్ధంబు; కృష్ణుండు మరలి చనుదెంచి సాల్వుం బరిమార్చుట; దంతవక్త్ర వధ; విదూరథ మరణంబు; కృష్ణుండు యాదవ బల సమేతుండై క్రమ్మఱ నిజపురంబునకుం జనుట;

కౌరవ పాండవులకు యుద్ధం బగునని బలదేవుండు తీర్థయాత్ర సనుట; యందు జాహ్నావీప్రముఖ నదులం గృతస్నానుం డయి నైమిశారణ్యంబునకుం జనుట; యచ్చటి మునులు పూజింపం బూజితుం డయి తత్సమీపంబున నున్నతాసనంబున నుండి సూతుండు దన్నుం గని లేవకున్న నలిగి రాముండు గుశాగ్రంబున నతని వధించుట; బ్రహ్మహత్యా దోషంబు గలిగె నని మునులు వలికిన సూతుం బునర్జీవితుం జేయుట; యమ్మునులకుం బ్రియంబుగాఁ గామపాలుం డిల్వల సుతుండగు పల్వలుం బరిమార్పుట; వారిచేత ననుమతుం డయి హలధరుండు దత్సమీప తీర్థంబుల స్నాతుండయి గంగా సాగర సంగమంబునకుం జనుట; మహేంద్రనగ ప్రవేశంబు; పరశురామ దర్శనంబు; సప్త గోదావరిం గ్రుంకుట; మఱియు మధ్యదేశంబునంగల తీర్థంబులాడి శ్రీశైల, వేంకటాచలంబులు దర్శించుట; వృషభాద్రి, హరిక్షేత్ర, సేతుబంధ, రామేశ్వరములం గని తామ్రపర్ణీ తీర్థంబు లాడుట; గోదానంబు లొనరించి మలయగిరి యందు నగస్త్యునిం గనుట; సముద్రకన్యా దుర్గాదేవుల నుపాసించుట; యందు బ్రాహ్మణజనంబువలనం బాండవ ధార్తరాష్ట్ర భండనంబున సకల రాజలోకంబును మృతి నొంది రని వినుట; వాయునందన సుయోధనులు గదా యుద్ధసన్నద్ధు లగుట విని వారిని వారించుటకై రౌహిణేయుం డందుల కరుగుట; యచట వారిచేతం బూజితుండయి వారిని వారింప లేక మగిడి ద్వారక కరుగుట; కొన్ని వాసరంబులకు మరల నైమిశారణ్యంబునకుం బోయి యచట యజ్ఞంబు సేసి రేవతియుం దానును నవభృథంబాడి నిజపురంబున కేతెంచుట;

కుచేలోపాఖ్యానంబు; సూర్యోపరాగంబునం కృష్ణుఁడు రామునితోఁ జేరి పురరక్షణంబునకుఁ బ్రద్యుమ్నాది కుమారుల నిలిపి షోడశసహస్రాంగనా పరివృతుండయి యక్రూర వసుదేవోగ్రసేనాది యాదవ వీరులు దోడరా శమంతపంచక తీర్థంబున కరిగి కృతస్నానుండయి వసియించి యుండుట; పాండవ కౌరవాది సకల రాజలోకంబును దత్తీర్థంబునకు వచ్చుట; కుంతీదేవి దుఃఖంబు; నందయశోదా సహితు లైన గోపగోపి జనంబులు చనుదెంచుట; కుశలప్రశ్నాది సంభాషణంబులు; మద్రకన్యా ద్రౌపదీ సంభాషణంబు; తదనంతరంబ సకల రాజలోకంబును శమంతపంచకతీర్థంబున స్నాతులై రామకృష్ణాది యాదవ వీరుల నామంత్రణంబు చేసి నిజ దేశంబులకుఁ బోవుట; కృష్ణుని దర్శించుటకు మునీంద్రు లేతెంచుట; వారి యనుమతిని వసుదేవుండు యాగంబు నెరవేర్చుట; నంద యశోదాది గోపికానివహంబుల నిజపురంబున కనిచి యుగ్రసేనాది యాదవవీరులుం దానును మాధవుండు నిజపురప్రవేశంబు సేయుట; తొల్లి కంసునిచేత హతులై బలిపురంబున నున్న దేవకీదేవి సుతుల రామకృష్ణులు యోగమాయాబలంబునఁ దెచ్చి యామె కిచ్చుట; యర్జునుండు సుభద్రను వివాహంబగుట; కృష్ణుండు మిథిలానగరంబున కరుగుట; శ్రుతదేవ, జనకుల చరిత్రంబు; వారలతో బ్రాహ్మణ ప్రశంస సేయుట; శ్రుతిగీతలు; హరిహరబ్రహ్మల తారతమ్య చరిత్రంబు; కుశస్థలి నుండు బ్రాహ్మణుని చరిత్రంబు; యతని తనయులు పరలోకంబునకుం బోయినఁ గృష్ణార్జునులు తమ యోగబలంబున వారిం దెచ్చి యవ్విప్రున కిచ్చుట; కృష్ణుం డర్జునుని వీడ్కొని ద్వారక కరుగుట; యందు మాధవుం డయ్యై ప్రదేశంబుల సకల భార్యా పరివృతుండయి విహరించుట; యాదవ వృష్ణి భోజాంధక వంశ చరిత్రంబు.

ఏకాదశ స్కంధము
కృష్ణుండు భూభారంబు వాపి యాదవుల కన్యోన్య వైరానుబంధంబుఁ గల్పించి; వారల హతంబు గావించుట; విదేహర్షభ సంవాదంబు; నారాయణ ముని చరిత్రంబు; నాలుగు యుగంబుల హరి నాలుగువర్ణంబులై వర్తించుట; బ్రహ్మాది దేవతలు ద్వారకానగరంబునకుం జని కృష్ణుం బ్రార్థించి నిజపదంబునకు రమ్మనుట; యవధూత యదు సంవాదంబు; యుద్ధవునకుఁ గృష్ణుం డనేకవిధంబు లైన యుపాఖ్యానంబు లెఱింగించుట; నారాయణప్రకారం బంతయు దారకుం డెఱింగివచ్చి ద్వారకానివాసులకుం జెప్పుట; కృష్ణుండు దన దివ్యతేజంబుతోఁ బరమాత్మం గూడుట.

ద్వాదశ స్కంధము
రాజుల యుత్పత్తి; వాసుదేవ లీలావతార ప్రకారంబు; కలియుగధర్మ ప్రకారంబు; బ్రహ్మప్రళయ ప్రకారంబు; ప్రళయ విశేషంబులు; దక్షకునిచే దష్టుండై పరీక్షిన్మహారాజు మృతినొందుట; సర్పయాగంబు; వేదవిభాగక్రమంబు; పురాణానుక్రమణిక; మార్కండేయోపాఖ్యానంబు; సూర్యుండు ప్రతిమాసంబును వేర్వేఱు నామంబుల వేర్వేఱు పరిజనంబులతో జేరుకొని సంచరించు క్రమంబు; తత్తత్పు రాణగ్రంథసంఖ్యలు.

ఇది శ్రీ పోతన తెలుగు భాగవతంబను మహాపురాణంబునకు సంక్షిప్తము సర్వంబు సమాప్తము.

ఓం ఓం ఓం
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వేజనా స్సుఖినో భవంతు